కడప అర్బన్ : జిల్లాలోని ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌కు టీడీపీ నేతలు ఆదివారం వెళ్లి అక్కడి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లెకు చెందిన హరికృష్ణారెడ్డి, వెంకట సుబ్బమ్మ, శంకర్‌రెడ్డిపై టీడీపీకి చెందిన బ్రహ్మానందరెడ్డి, మరి కొంత మంది దాడి చేసి శనివారం రాత్రి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనలో బాధితుల ఫిర్యాదు స్వీకరించినప్పటికీ టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పై ముగ్గురితోపాటు మరో ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయులపై కేవలం ఘర్షణ కేసు నమోదు చేశారు. ఈ కేసును కూడా ఎందుకు నమోదు చేస్తారని టీడీపీ నేతలు పోలీసుస్టేషన్‌పైకి వెళ్లి అక్కడ సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్, ఇతర సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పోలీసులు సంఘటనలపై స్పందించే తీరు ఆరోపణలకు తావిస్తోంది. ఒక వైపు హత్యాయత్నం కేసులు, మరోవైపు ఘర్షణ కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ టీడీపీ నేతలు పోలీసుస్టేషన్ పైనే దౌర్జన్యానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటనపై పోలీసు అధికారులు ప్రత్యేకంగా విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.