కల్తీ కిక్కు | TDP leaders cast liquor traders | Sakshi
Sakshi News home page

కల్తీ కిక్కు

Published Sat, Jan 7 2017 1:44 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

కల్తీ కిక్కు - Sakshi

కల్తీ కిక్కు

అనకాపల్లి కేంద్రంగా నిర్భీతిగా తయారీ
జిల్లాలోని పలు ప్రాంతాల్లోవిచ్చలవిడిగా అమ్మకాలు
 సూత్రధారులుఅధికార టీడీపీ నేతలే పాత్రధారులు మద్యం వ్యాపారులు
బడుగు జీవితాలతో ఆటలు
పట్టించుకోని ఆబ్కారీ అధికారులు


ఏడాది క్రితం.. విజయవాడలో ఐదుగురు బడుగులను కల్తీ మద్యం కాటేసింది.. అక్కడి దాకా ఎందుకు.. మన జిల్లాలోనే  పది నెలల క్రితం ఎలమంచిలిలో ఓ నిండు జీవితం కల్తీ కాటుకు బలైపోయింది.. ఇలా వెలుగు చూస్తున్న ‘కల్తీ’ విషాదాలు ఒకటో రెండో మాత్రమే.. వెలుగు చూడకుండానే మలిగిపోతున్న జీవితాలెన్నో..   మత్తుకు బానిసలై.. కల్తీ బారిన పడి మగవారు ప్రాణాలు కోల్పోతుంటే.. వారిపైనే ఆధారపడిన కుటుంబాలకు దిక్కులేకుండాపోతోంది.. వీటిని అరికట్టాల్సిన అధికారులు మాత్రం కల్తీబాబులు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారు.. దుర్ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత మళ్లీ మామూళ్ల మత్తులోకి జారుకోవడం పరిపాటిగా మారింది.   సరిగ్గా ఇదే.. కల్తీ మద్యం వ్యాపారులకు అవకాశంగా మారుతోంది..   అనకాపల్లి కేంద్రంగా సాగుతున్న కల్తీ మద్యం రాకెట్‌దీ ఇదే పరిస్థితి..   తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువులే ఈ రాకెట్‌ సూత్రధారులు..   వారి అండతో చీప్‌ లిక్కర్‌ లాభాల రుచి మరిగిన మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వైన్‌షాపులు.. వాటికి అనుబంధంగా పెట్టుకున్న బెల్ట్‌ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరుల్లా ప్రవహింపజేస్తున్నారు.  

విశాఖపట్నం: అనకాపల్లి పరిసరాల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. కశింకోట మండలం ఎన్జీపాలెంలోని టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ ఇల్లు కల్తీ మద్యం తయారీ కేంద్రంగా మారింది. నూతనగుంటపాలెం గ్రామంలో టీడీపీ ప్రజాప్రతినిధి బంధువైన ఓ వైన్‌ షాపు  యజమాని, ఆయన బావమరిది పక్కా ప్రణాళికతో ఆ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారు. అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలు, అనకాపల్లి పట్టణంలోని కొన్ని వైన్‌ షాపులకు, బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.  

కల్తీ మద్యం తయారీ ఇలా
ప్రభుత్వ డిపో నుంచి వచ్చిన మద్యం బాటిళ్ల కప్పులను టెస్టర్‌ ద్వారా తొలగిస్తారు. బాటిళ్లలోని మద్యాన్ని ఒక బకెట్‌లో వేసి.. అందులో చీప్‌లిక్కర్, మరికొంత నీరు కలిపి మళ్లీ యధావిధిగా బాటిళ్లలో నింపుతారు. అనంతరం మూతలు అమర్చి వాటికి సపోర్టుగా ఉండే సిల్వర్‌  రేకును టెస్టర్‌తో నొక్కి పెడతారు. సరిగ్గా గమనిస్తే కల్తీ మద్యం బాటిళ్ల కప్పులు టెస్టర్‌తో నొక్కినట్లు కనిపిస్తాయి. మద్యం తాగే వారికి ఎటువంటి అనుమానం రాకుండా ఎక్కువ ఆల్కహాల్‌ కంటెంట్‌ ఉండే చీప్‌ లిక్కర్‌ కలుపుతారు. దీంతో కల్తీ మద్యమని ఎవరికీ అనుమానం రాదు. రాయల్‌ స్టాగ్, ఇంపీరియల్‌ బ్లూ, ఓసీ, డీఎస్‌పీ బ్రాండ్ల మద్యం ఎక్కువగా కల్తీ అవుతున్నట్టు తెలుస్తోంది. సీల్, స్టిక్కర్లపై పొరపాటున సందేహం వచ్చి ఎవరైనా అడిగినా.. మద్యం బాటిల్‌ తెరిస్తే స్పిరిట్‌ వాసన గుప్పుమంటోందని కొనుగోలుదారులెవరైనా ప్రశ్నించినా.. షాపుల యజమానులు వారిపై కలబడిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

ఎక్సైజ్‌ అధికారులు ఏం చేస్తున్నట్టు?
అనకాపల్లి పరిసరాల్లో కల్తీమద్యం ఏరులైపారుతున్నట్టు ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి వచ్చినా మామూళ్లు తీసుకుని ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ ఎక్సైజ్‌ అధికారికి కల్తీ మద్యం వ్యాపారులు కారు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీదారులు  టీడీపీ నేతకు దగ్గర బంధువులు కావడంతో పాటు ప్రతి నెలా నజరానాలు సమర్పిస్తుండటంతో తనిఖీలు చేపట్టాల్సిన సదరు అధికారి ఏమాత్రం పట్టించుకోకుండా కల్తీ మద్యం విక్రయాలకు పచ్చ జెండా ఊపినట్టు చెబుతున్నారు. గతంలో అనకాపల్లిలోని ఏఎంఏఎల్‌ కళాశాల జంక్షన్‌ వద్ద ఉన్న ఓ వైన్‌షాపులో, ఓ సినిమా థియేటర్‌  సమీపంలోని బార్‌లోనూ, అనకాపల్లి మార్కెట్‌యార్డు ముందున్న మరో బార్‌లో నకిలీ  మద్యం అమ్మకాలు జరగ్గా.. అప్పట్లో ఎక్సైజ్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కొన్నాళ్లు కల్తీ, నకిలీ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట పడింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. మళ్లీ ఇటీవల కాలంలో కల్తీ విక్రయాలు పెచ్చుమీరిపోయాయి. కాగా, మామూలుగా పంచాయతీకి ఒక వైన్‌షాపుతోపాటు ఒక బెల్టు షాపు ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. అలాంటిది అనకాపల్లి పరిసరాల్లో ఒక్కో పంచాయతీలో ఐదారు బెల్టుషాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement