పులివెందులలో మూసివేసిన రాఘవేంద్ర థియేటర్
పులివెందుల/పులివెందుల రూరల్ : పట్టణంలోని సినిమా థియేటర్ల విషయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ నడుస్తోంది. పట్టణంలో 5 సినిమా థియేటర్లు ఉన్నాయి. అయితే ఇటీవల కొత్త సినిమా విడుదల సందర్భంగా అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించుకోవడానికి ఓ వర్గం.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం టిక్కెట్ల ధరలు విక్రయించాలని మరొక వర్గం పట్టుబట్టాయి. దీంతో ఒక దశలో ఇరువర్గాలకు చెందిన చోటా నాయకులు ఘర్షణకు సైతం దిగారు. ఈ ఘర్షణకు కారణం కమీషన్ల కోసమేనని తెలుస్తోంది. ఓ వర్గం థియేటర్ల యాజమాన్యాలను నెలవారీ కమీషన్లు ఇవ్వాల్సిందిగా హుకుం జారీ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మరోవర్గం కమీషన్లు తమకు దక్కలేదన్న కారణంతో ఆ అధిక ధరలకు విక్రయిస్తున్నారని.. నిబంధనలు పాటించడం లేదని అధికారులు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు హాళ్ల వద్దకు వెళ్లి పరిశీలించి రాఘవేంద్ర, లక్ష్మి, మారుతి థియేటర్లను సీజ్ చేశారు. ఈ థియేటర్లకు నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికి కేవలం ఫైర్‌స్టేషన్‌కు సంబంధించిన అనుమతి పత్రం లేదన్న కారణంతో సీజ్ చేశారు. అధికారులు తెలుగు తమ్ముళ్ల ఒత్తిడికి తట్టుకోలేక మూసివేసినట్లు తెలిసింది.
వేధింపులతో స్టాపింగ్ వైపు..
జిల్లాలో ఉన్న థియేటర్లలో అన్ని అనుమతులు ఉన్నవి వేళ్లపై లెక్క పెట్టవచ్చు. మూసివేత కారణంగా ఒక్కో థియేటర్‌లో 15మంది కార్మికులు జీవనోపాధి కోల్పోతారు. ఇందులో లక్ష్మి థియేటర్‌ను ప్రస్తుతం నిర్వహిస్తున్న యజమాని 4 నెలల క్రితం లీజుకు తీసుకున్నారు. కొంతమంది తమ్ముళ్లు రిలీజ్ సినిమాలకు బెనిఫిట్ షో నడిపేందుకు ముందుండి అన్నీ తామే చూసుకుంటామని యజమానులతో, అధికారులతో కుమ్మక్కై కమీషన్లు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీలు, స్మార్ట్‌ఫోన్ల ప్రభావంతో థియేటర్లు నడవడం గగనమైన నేపథ్యంలో టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి పెంచి మూసివేయించడం తగదని ప్రజలంటున్నారు. పట్టణంలోని రాఘవేంద్ర థియేటర్ యజమానులు అసలే నష్టాలతో హాలు నడుపుతున్నామని, అలాంటి పరిస్థితుల్లో ఇలా కమీషన్లు, నష్టాలను భరించలేక తాము థియేటర్ నడపలేమని, స్టాపింగ్‌కు అనుమతి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్‌ను కోరినట్లు తెలిసింది. త్వరలోనే ఈ థియేటర్‌ను కూల్చివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
థియేటర్ల యజమానుల పరిస్థితి అగమ్యగోచరం
పులివెందులలో ఉన్నఫలంగా థియేటర్లు మూసివేయడంతో యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో థియేటర్లకు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు నిబంధనలు సరిగా లేకుంటే జరిమానా విధించి 20 నుంచి 30 రోజులు గడువు ఇచ్చి అనుమతిపత్రాలు తెచ్చుకోవాలని సూచించేవారు. కానీ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల ఒత్తిడితో ఉన్నఫలంగా థియేటర్లను సీజ్ చేశారు. ఒక సినిమాకు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తామని, అంత పెద్దఎత్తున పెట్టుబడి పెట్టినా లాభాలు రానీ పరిస్థితుల్లో తాము మరో వ్యాపారం చేయడం తెలియక ఇందులోనే అష్టకష్టాలు పడుతున్నామని వారు వాపోతున్నారు. ప్రస్తుత పండుగ సీజన్‌లో థియేటర్లు మూసివేయడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.