రాయచోటి టీడీపీలో ఆధిపత్యపోరు!! tdp leaders communal conflicts in ysr district rayachoti | Sakshi
Sakshi News home page

రాయచోటి టీడీపీలో ఆధిపత్యపోరు!!

Published Thu, May 26 2016 9:57 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

రాయచోటి టీడీపీలో ఆధిపత్యపోరు!! - Sakshi

మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఒంటరి చేసేందుకు యత్నాలు
4 దశాబ్దాల రాజకీయానికి సొంతపార్టీ నుంచే ఎదురుదెబ్బలు
మినీమహానాడుకు సీనియర్ నేత రాయుడు వర్గం దూరం
10 నిమిషాల ముందు ఆహ్వానించడంపై మండిపాటు
రాయచోటిలో హాట్ టాఫిక్‌గా మారిన విభేదాలు


కడప: రాయచోటి టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. సీనియర్ నేతలను కొందరు కావాలనే విస్మరిస్తున్నారు. పార్టీలో అంతాతానై నడిపిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గీయుల మనగడే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్‌ఆర్ సోదరులు రాయుడు కుటుంబానికి పొమ్మనకుండా పొగబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు మినీ మహానాడు వ్యవహారమే నిదర్శనంగా నిలుస్తోంది. కావాలనే తమను దూరం చేస్తున్నట్లుగా రాయుడు వర్గీయులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
 
వ్యూహాత్మక ఎత్తుగడలతో..
 రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడుకు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ ఉన్నతికి ఎనలేని సేవలు అందించారు. అలాంటి రాయుడు కుటుంబం ప్రస్తుతం పార్టీలో ఇబ్బందులకు గురవుతోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్‌రెడ్డిలు వ్యూహాత్మక ఎత్తుగడలతో రాయుడు వర్గాన్ని టీడీపీ నుంచి దూరం చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మంగళవారం రాయచోటిలో నిర్వహించిన మినీ మహానాడుకు కావాలనే రాయుడు వర్గాన్ని దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్ సోదరులు టీడీపీలో చేరినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే రాయుడు వర్గంపై ప్రత్యేకదృష్టి సారించినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. క్రమేణా వారి ప్రాబల్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. పలు విషయాల్లో ఆర్‌ఆర్ సోదరుల తీరుతోనే విభేదాలు తీవ్రతరమయ్యాయని రాయుడు వర్గీయులు ఆరోపిస్తున్నారు.

శాసించేస్థాయి నుంచి.....
టీడీపీలో రాయచోటి పేరు చెబితే పాలకొండ్రాయుడు పేరు విన్పించేది. జిల్లా టీడీపీని శాసించే స్థాయి నుంచి చివరకు పార్టీలో మనుగడ కోసం పోరాడాల్సిన స్థాయికి పరిస్థితులు దారితీ శాయి. వాటిని గమనిస్తే.. 1978లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన సుగవాసి పాలకొండ్రాయుడు తొలుత జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో టీడీపీ ప్రభంజనం కొనసాగినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆతర్వాత 1985లో టీడీపీ తరఫున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. తర్వాత 1999, 2004 ఎన్నికల్లో సైతం రాయచోటి  ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వారసత్వ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన పెద్ద కుమారుడు బాలసుబ్రమణ్యం టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. చిన్నకుమారుడు ప్రసాద్‌బాబు సైతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డిని వరించాయి. అప్పటి నుంచి రాయుడు వర్గాన్ని అణచివేసే ఎత్తుగడలు మొదలయ్యాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆమేరకే రెండు వర్గాల మధ్య తరుచూ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.
 
కావాలనే దూరం చేస్తున్నారని.....
ఆర్‌ఆర్ సోదరులు కావాలనే సుగవాసీ కుటుంబాన్ని దూరం చేస్తున్నారని రాయుడు వర్గీయులు ఆరోపిస్తున్నారు. అందుకు మినీ మహానాడు పిలుపు వ్యవహారాన్ని వారు తెరపైకి తెస్తున్నారు. 10 గంటలకు కార్యక్రమం ఉం టే 9.47కు పీఏ ద్వారా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాన్ని రాయుడు వర్గీయులు జీర్ణించుకోలేకున్నట్లు సమాచారం. ఆమేరకు మినీ మహానాడుకు రాయుడు వర్గం దూరం గా ఉండిపోయారు. ఈవ్యవహారం ప్రస్తుతం రాయచోటిలో హాట్ టాఫిక్‌గా మారింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన పాలకొండ్రాయుడు పరిస్థితి టీడీపీలో రోజురోజుకు దిగజారుతున్నట్లు సమాచారం.

చంద్రబాబుకు సమకాలిన నేతగా గుర్తింపు ఉన్న రాయుడుకు అధినేత ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ప్రస్తుత విపత్కర పరిస్థితికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈనెల 27 నుంచి నిర్వహించతలపెట్టిన రాష్ట్రస్థాయి మహానాడుకు వెళ్లి పరిస్థితులు సీనియర్ నేతలకు వివరించాలనే దిశగా రాయుడు వర్గీయులు ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఆర్ సోదరులు వ్యవహారాన్ని తేల్చుకోవాలనే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాము ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా, తమ మద్దతు లేకుండా టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎంపికయ్యే అవకాశమే లేదని, పార్టీలో తమ భవిష్యత్ ఏమిటో తేల్చుకుంటామని రాయుడువర్గానికి చెందిన ఓ నాయకుడు పేర్కొనడం విశేషం.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement