టీడీపీ నేతల ‘నకిలీ’లలు..
నల్లగొండ జిల్లాలో నకిలీ కరెన్సీ చెల్లామణీ కేసులో నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకులే కీలకపాత్రధారులుగా ఉన్నారు. నియోజకవర్గ నాయకుడి కుమారుడు సైతం ఇందులో కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది.
* దొంగనోట్ల కేసులో మాచర్ల ‘దేశం’ నేత అనుచరులు
* నల్గొండ పోలీసుల అదుపులో ముఠా
* కీలక సూత్రధారిగా టీడీపీ నేత తనయుడు
* టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొంగనోట్ల తయారీ!
* మాచర్లలోనూ మార్చినట్లు నిర్ధారణ
సాక్షి, గుంటూరు/ మాచర్ల/ వెల్దుర్తి : నల్లగొండ జిల్లాలో నకిలీ కరెన్సీ చెల్లామణీ కేసులో నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకులే కీలకపాత్రధారులుగా ఉన్నారు. నియోజకవర్గ నాయకుడి కుమారుడు సైతం ఇందులో కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నియోజక వర్గంలో ఎక్కడ చూసినా దొంగనోట్ల చెలామణిలో పాలక పార్టీ నాయకుల పాత్ర గురించే చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో వెల్లడవుతున్న విషయాలు విని ప్రజలు అవాక్కవుతున్నారు. దొంగనోట్ల కేసులో నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలానికి చెందిన కండ్లకుంట, గంగలకుంట గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా ఈ ప్రాంతానికి చెందిన మరో ఐదుగురికి సంబంధం ఉన్నట్టు తెలుసుకుని వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ పార్టీ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రూ.18 లక్షల నకిలీ కరెన్సీ, దొంగ నోట్ల ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇందులో కీలక పాత్ర పోషించిన టీడీపీ నాయకుడి కుమారుడి పాత్రపై ఆరా తీసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. నల్లగొండ జిల్లాలో దొంగనోట్లు చెలామణి చేసిన నిందితులు ఎంతమంది ఉన్నారు? మాచర్ల నుంచి వచ్చి వివిధ ప్రాంతాలలో ఎంత మార్చారు? ఎక్కడెక్కడ వీరికి సంబంధాలున్నాయి? నకిలీ కరెన్సీ మార్పిడిలో మొత్తంగా కీలక పాత్రవహించిన వారెవరు? ఇంకా ఎక్కడెక్కడ నకిలీ నోట్ల డంప్‌లున్నాయి... ఎవరిని అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం తెలుస్తుందనే దిశగా నల్లగొండ జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీంతో నకిలీ కరెన్సీ మార్పిడికి సంబంధించిన వివరాల సేకరణతో పాటు సంబంధిత∙వ్యక్తుల కదలికలు తెలుసుకుంటూ మరికొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ వారు దొంగనోట్ల మార్పిడిలో కీలకపాత్ర పోషించారని తెలిసి వామ్మో అధికారం వస్తే నాయకులు చేసే పనులు ఇవేనా అంటూ ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
కీలక సూత్రధారి టీడీపీ నేత తనయుడే?
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలానికి చెందిన దొంగనోట్ల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే మాచర్ల నియోజకవర్గ టీడీపీ నేత తనయుడు దొంగనోట్ల వ్యవహారంలో కీలక సూత్రధారిగా చెబుతున్నారు. దొంగ నోట్ల కేసులో దొరికిన టీడీపీ నేత అనుచరులు ఇదే విషయాన్ని పోలీసుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో అతన్ని కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత తనయుడు దొంగనోట్ల తయారీ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లు మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
వీరే కాదు...
కేసులో నిందితులుగా ఉన్న సూదినబోయిన అమరయ్య, బత్తుల శ్రీరాములు, దొండ మార్కొండారెడ్డి, తాటిపర్తి పాపిరెడ్డి మాచర్ల నియోజకవర్గ టీడీపీ నేత అనుచరులుగా తెలుస్తోంది. వీరిలో తాటిపర్తి పాపిరెడ్డి సదరు టీడీపీ నేతకు ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఆయన కోసం అనేక గొడవల్లో సైతం పాల్గొన్నట్లు సమాచారం. వీరితో పాటు వెల్దుర్తి మండలం కండ్లకుంట, గంగలకుంట గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ నేతలకు సైతం దొంగ నోట్ల వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కండ్లకుంట గ్రామంలో దొంగనోట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న అనేక మంది పోలీసులు ఎక్కడ తమను తీసుకెళతారోననే భయంతో పరారీలో ఉన్నట్లు సమాచారం.
పట్టించుకోని జిల్లా పోలీసులు..
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కండ్లకుంట, గంగలకుంట గ్రామాలకు చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తలు దొంగనోట్లు మారుస్తూ నల్గొండ పోలీసులకు దొరకడంతో మాచర్ల టీడీపీలో తీవ్ర కలకలం రేగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నియోజకవర్గ నాయకుని తనయునితో పాటు, ఆయన ముఖ్య అనుచరులు దొంగనోట్లు తయారు చేస్తూ గుంటూరు జిల్లాతో పాటు, నల్గొండ జిల్లాలోనూ వాటిని చెలామణి చేస్తూ వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు పోలీసులు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. నల్గొండ పోలీసులు బుధవారం దొంగనోట్ల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఓ ప్రింటర్, పేపర్ కట్టర్‌తో పాటు రూ.18.95 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకోవడంతో అంతా అవాక్కయ్యారు. ఈ కేసులో కీలక సూత్రధారి పేరు బయటకు రాకుండా పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. రెండు రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నా జిల్లా పోలీ సులు దొంగనోట్ల కేసుపై దృష్టి సారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానిక పోలీసులకు దొంగనోట్ల వ్యవహారం తెలిసినా అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో చూస్తూ ఊరుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నల్గొండ పోలీసులు అరెస్టు చేసింది నలుగురిని మాత్రమేనని, ఇంకా చాలా మంది టీడీపీ నాయకులకు దొంగనోట్ల వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయనిఆరోపణలు వెల్లువెత్తుతున్నా, జిల్లా పోలీసులు దీనిపై కనీస దృష్టి పెట్టకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు సీరియస్‌గా దృష్టి సారించి దొంగనోట్ల వ్యవహారం మూలాలను బయటకు తీయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.