తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
- అధ్యక్ష పదవి నాకంటే నాకంటూ వాగ్వాదం
- పరిశీలకుడి ముందే నేతల తోపులాట
- ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్న వైనం
- కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇదే పరిస్థితి
సాక్షి, కరీంనగర్: కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అడహక్ కమిటీ కన్వీనర్ పదవి కోసం తెలుగు తమ్ముళ్లు ఆదివారం బాహాబాహీకి దిగారు. పార్టీ రాష్ట్ర పరిశీలకుల ముందే వాగ్వాదానికి దిగిన పార్టీ నేతలు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థాయికి గొడవ వెళ్లింది. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోగా, గ్రూపులుగా విడిపోయి గొడవలకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాల విభజన కారణంగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ఆదివారం ఉదయం కరీంనగర్, మధ్యాహ్నం సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశానికి పరిశీలకులుగా ఒంటేరు ప్రతాపరెడ్డి హాజరయ్యారు.
సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కల్యాణపు ఆగయ్య, మేడిపల్లి సత్యం, చందా గాంధీలు సీనియర్లకు పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించాలని ప్రసంగించారు. అయితే, వీటిని వక్రీకరిస్తూ కవ్వంపెల్లి సత్యనారాయణ వ్యంగ్య ప్రసంగం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. అధ్యక్ష పదవి నాకు కావాలంటే.. నాకు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన నాయకులు, కార్యకర్తలు పరస్పర ఘర్షణకు దిగారు. సంయమనం కోల్పోయిన కార్యకర్తలు వేదికపైకి కుర్చీలు విసరడంతో రసాభాసగా మారింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు తోపులాడుకుంటూ ఒకరిపై మరొకరు పడి తన్నుకున్నారు. ఒంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయరమణారావులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు.
ఈ పదవికి ఆరుగురు నేతలు పోటీపడగా, గొడవకు దిగిన ముగ్గురు నేతలు అధ్యక్ష రేసులో ఉన్నవారే. అలాగే, కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశం సైతం రసాభాస జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి కోసం అన్నమనేని నర్సింగరావు, బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు రెడ్డబోయిన గోపీ, కౌన్సిలర్ బార్ల సందీప్‌లు పోటీపడుతుండగా, సమావేశం సందర్భంగా వీరంతా బలప్రదర్శనకు దిగారు. ఉమ్మడి జిల్లాలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఓ నాయకుడు, ఆ సమావేశంలో అన్నమనేని నర్సింగరావుకు పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు ఒంటేరు ప్రతాపరెడ్డి ముందే నాయకులు విమర్శలు గుప్పించారు. మాటామాట పెరిగి మూడు గ్రూపుల నాయకులు, కార్యకర్తలు కుర్చీలు విసురుకోవడంతో రసాభాస జరిగింది. దీంతో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో కమిటీలను ప్రకటించకుండానే పార్టీ పరిశీలకులు వెనుతిరిగారు.