నువ్వెంత.. నువ్వెంత?
- నరసాపురం టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
- పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే వర్గీయుల ఘర్షణ
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీలో వర్గవిభేదాలు బాహాబాహీ వరకు వెళ్లాయి. ఎమ్మెల్యే మాధవనాయుడు వర్గీయులు, ఇటీవల పార్టీలో చేరిన మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గీయులు దూషించుకుంటూ కలబడ్డారు. వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన వారికి, పార్టీలో ఉన్నవారికి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరిలోను, ప్రకాశం జిల్లా అద్దంకిలోను వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు, ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నేతలకు సయోధ్య కుదరని విషయం, అద్దంకిలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగటం తెలిసిందే.
ఈ కోవలోనే నరసాపురంలో ఆదివారం ఇరువర్గాలు కలబడ్డాయి. ఎమ్మెల్యే మాధవనాయుడు, వైఎస్సార్‌సీపీ నుంచి ఇటీవల పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు తమ వర్గాలను వెనకేసుకొస్తూ ప్రత్యర్థి వర్గాలను హెచ్చరించడటంతో కార్యకర్తలు మరీ రెచ్చిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బూతులు తిట్టుకున్నారు. నరసాపురంలో జరిగిన టీడీపీ నియోజ కవర్గ విస్తృతస్థాయి సమావేశం దీనికి వేదికైంది. ఈ సమావేశానికి నేతలిద్దరూ తమ వర్గాలతో హాజరయ్యారు. కొత్తపల్లి చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ కార్యకర్తలు, కొత్తపల్లి వర్గీయులు గొడవకు దిగారు. తోసుకున్నారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎం.ఎ.షరీఫ్ మైక్‌లో ఎంత బతిమాలినా.. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు వినలేదు. ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కల్పించుకుని కొత్తపల్లి వర్గీయులపై ఫైర్ అయ్యారు. తన వర్గాన్ని వెనకేసుకొస్తూ.. గొడవ చేసేవారు సమావేశం నుంచి వెళ్లిపోవాలని కొత్తపల్లి ఎదుటే వార్నింగ్ ఇచ్చారు.
కొత్తపల్లి కూడా ‘మా వాళ్లు ఏమీ గొడవ చేయడంలేదు, మీ వాళ్లనే కంట్రోల్ చేయాలి’ అని స్పందించారు. దీంతో రెండు వర్గాలు రెచ్చిపోయాయి. నాయకులు, కార్యకర్తలు బూతులు తిట్టుకుంటూ తోసుకున్నారు. అతిథులుగా వచ్చిన నేతలు ప్రేక్షక పాత్ర పోషించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి అతికష్టం మీద ప్రైవేట్ సెక్యూరిటీ సాయంతో వేదిక దిగి వెళ్లిపోయారు. ఒకదశలో సమావేశాన్ని రద్దు చేస్తున్నానని ఎమ్మెల్యే ప్రకటించినా.. కార్యకర్తలు వెనుదిరగలేదు. చివరకు పోలీసులను రప్పించి, పరిస్థితిని అదుపుచేశారు. తూతూమంత్రంగా సమావేశం ముగించారు.