ఏలూరు: ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ల కొట్లాటలు కంటిన్యూ అవుతున్నాయి. మొన్న తిరుపతి, నిన్న ప్రకాశం, నేడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో తమ్ముళ్లు కుమ్ములాటలకు దిగారు. రాష్ట్రంలో నేతల తీరుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే తలపట్టుకుంటున్నారు.
నరసాపురం టీడీపీ నియోజకవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవనాయుడు, స్థానిక టీడీపీ నేతలతో పాటు టీడీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొత్తపల్లి చేరికపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవనాయుడు, కొత్తపల్లి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం ఇరువర్గాలు బాహాబాహీగా దిగి కొట్టుకున్నారు. దీంతో జిల్లా నేతలు విస్తుపోయారు.
తీవ్ర ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే మాధవనాయుడు సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. తన సమక్షంలోనే గొడవ జరగడంపై జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కొత్తపల్లి తీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోవాలని ఆమె సూచించారు. కొత్తపల్లి వ్యవహారశైలిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయునున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాధవనాయుడు బుజ్జగించే పనిలో ఉన్నారు.