టీడీపీ నేతల ముఠా నాయకుడు ఎవరు!
టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి ఏలూరులోని చేనేత సహకార సంఘానికి చెందిన 4 వేల గజాల స్థలాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ముఠాలో ఉన్న వాళ్లంతా టీడీపీకి చెందిన చోటామోటా నేతలే కాగా.. తెరవెనుక కథ నడిపిన నాయకుడు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. కీలక నాయకుడి అభయం లేకుండానే ఆ నేతలు అంత ధైర్యం చేసి వివాదాస్పద స్థలం కొనుగోలు చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏలూరు వీవర్స్ కాలనీలోని సుమారు 4వేల గజాల స్థలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, నగర శాఖ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్‌కుమార్‌తోపాటు అదే పార్టీకి చెందిన రెడ్డి వెంకటరమణ, నడిపూడి ఈశ్వరరావు, లంకా తిరుపతి, ఆరంగి మురళీకృష్ణ, రాజనాల రామచంద్రరావు, గద్దె రుష్యేంద్ర నాగవర దుర్గాప్రసాద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
గజం రూ.8 వేల చొప్పున మొత్తం స్థలాన్ని రూ.3కోట్ల 6 లక్షలకు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ రికార్డుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి గజం రూ.8 వేల చొప్పున కూడా కాకుండా సొసైటీ అధ్యక్షుడు మత్సా శాంతారావుకు మొత్తంగా రూ.కోటిలోపు మాత్రమే సొమ్ము ఇచ్చి స్థలాన్ని సొంతం చేసుకున్నారని అంటున్నారు. మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ రూ.7 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. భూముల దరలు ఆకాశన్నంటిన రెండేళ్ల కిందటే నగరానికి చెందిన ఓ న్యాయవాది ఆ స్థలంపై కన్నేసి కొనుగోలు చేసేందుకు శాంతారావును సంప్రదించారు. అప్పట్లో గజం రూ.ఐదు వేల చొప్పున విక్రయానికి డీల్ కుదిరింది. ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు పక్కాగా లేకపోవడం, ప్రభుత్వపరమైన అడ్డంకులు ఉన్నాయని తెలిసి ఆ న్యాయవాది వెనక్కి తగ్గారు. దీంతో సొసైటీ పెద్దలు అధికారం దన్నుతో హల్‌చల్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు ఏ మాత్రం ధరకు ఆ స్థలాన్ని కట్టబెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
వాళ్లకేమీ తెలియదట
నగరంలో విలువైన స్థలాలు ఇలా పార్టీ నేతల అధీనంలోకి వెళ్లిపోతున్నా టీడీపీకే చెందిన తమకు అసలేమీ తెలియకపోవడంపై స్థానికసంస్థల ప్రజాప్రతినిధి గుర్రుగా ఉన్నారట. ఈ విషయమై అసంతృప్తిగా ఉన్న ఏడవ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు పాలడుగు దీప్తి, ఆమె భర్త పాలడుకు మురళీశ్యామ్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. రెండురోజుల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్ గైర్హాజర్ కావడం వెనుక అసలు కారణం ఈ స్థల వివాదమేనని తెలుస్తోంది. మరోపక్క ఈ స్థలాన్ని అడ్డగోలుగా అమ్మేయడంపై చేనేత కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విక్రయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ని మలుపులు తిరిగిన ఈ వివాదం చివరకు ఎటువైపు వెళ్తుంది, చోటామోటా నేతల వెనుక అండగా ఉన్న సూత్రధారి ఎవరు, రిజిస్ట్రేషన్ రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న చేనేత జౌళి శాఖ అధికారుల యత్నాలు ఫలిస్తాయా అన్నది తేలాల్సి ఉంది.
బేరం పెట్టారు
గుట్టుచప్పుడు కాకుండా సరిగ్గా నెల కిందట ఈ భూములను నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని పండగ చేసుకున్న నేతలకు నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం గుబులు పుట్టించింది. ముఖ్యంగా బంధువుల పేరిట ఒకటికి రెండు స్థలాలు కొనుగోలు చేసిన టీడీపీ నేత ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు రావడం లేదని అంటున్నారు. మరో కార్యకర్తయితే ఎందుకైనా మంచిదని తాను కోనుగోలు చేసిన స్థలాన్ని బేరం పెట్టేశారని తెలిసింది. ఆ స్థలానికి ఎదురుగా ఉన్న చేపల వ్యాపారికి రూ.1.70 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.