టీడీపీ కార్యకర్తల దాష్టీకం
-
రిజర్వాయర్ వాచ్‌మన్, భార్య, కుమార్తెపై దాడి
-
ఇరిగేషన్ కార్యాలయం ధ్వంసం, రికార్డులు దహనం
-
కేసు మాఫీకి టీడీపీ నేత హుకుం, ఇరిగేషన్ డీఈ మౌనం
-
ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ ఏఈ
బుచ్చిరెడ్డిపాళెం : మద్యం మత్తులో టీడీపీ కార్యకర్తలు క్రూరంగా ప్రవర్తించారు. రిజర్వాయర్ వాచ్‌మెన్‌ను, అతని భార్య, కుమార్తెలను మహిళలని చూడకుండా పైనబడి చితకబాదారు. తింటున్న అన్నం ప్లేటును కాలితో కొట్టి నానా రభస చేశారు. ఈ ఘటన మండలంలోని కనిగిరి రిజర్వాయర్ వద్ద ఈ నెల 25న జరిగింది. తొలుత కేసును మాఫీ చేసేందుకు టీడీపీ నేత రంగంలోకి దిగాడు. ఇందుకు ఇరిగేషన్ డీఈ మద్దతు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ఏఈ ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో 27న పోలీసులు కేసు నమోదు చేశారు.
బుచ్చిరెడ్డిపాళెం మంగళకట్టకు చెందిన టీడీపీ కార్యకర్తలు హరి, మరి కొంతమంది మద్యం తాగేందుకు ఈ నెల 25న కనిగిరి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. రాత్రి కావస్తున్నా తాగుతూనే ఉన్నారు. అక్కడ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సంజీవయ్య వారిని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న హరి, మరికొందరు సంజీవయ్యపై దాడి చేశారు. అక్కడే ఉన్న సంజీవయ్య భార్య రామమ్మ, కుమార్తె సంధ్య, అల్లుడు శేషయ్యపై దాడికి దిగారు. కంపచెట్లలోకి ఈడ్చుకుని వెళ్లి కొట్టారు. దీంతో భయపడి సంజీవయ్య రోడ్డుపైకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడి వెళ్లేలోగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు వెళ్లిన వెంటనే మళ్లీ హరి, మరో 9 మంది యువకులను తీసుకువచ్చి విచక్షణా రహితంగా సంజీవయ్యను కొట్టాడు. అంతటితో ఆగక ఇరిగేషన్ కార్యాలయం తలుపును పగలగొట్టాడు. కార్యాలయంలోని రికార్డులను బయటవేసి తగులపెట్టారు.
కేసు లేకుండా చూడండి
సంజీవయ్యపై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలు హరి, మరి కొంతమందిపై కేసు లేకుండా చూడాలని టీడీపీ మండల నేత ఒకరు ఇరిగేషన్ అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు గుర్రు మన్నా.. డీఈ శంకర్‌నారాయణ మాత్రం తొలుత టీడీపీ నేతల మాటకు తలూపినట్లు ఆరోపణలున్నాయి. అందుకే 25వ తేదీ రాత్రి సంఘటన జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రోజులు దాటవేశారని గిరిజన సంక్షేమ సంఘం నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డులు తగలబెడితే ఎంత నేరమో తెలిసి మౌనంగా రెండు రోజులు ఆలస్యం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మృగాల్లా వ్యవహరించారు
తాగి ఉన్నారు... వెళ్లిపోండి అంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదని, మృగాల్లా వ్యవహరించారని సంజీవయ్య భార్య, కుమార్తె వాపోయారు. తన కుమార్తె వద్దకు రావడం, పైన పడబోవడం, నానా దుర్భాషలాడడం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై ఎస్‌ఐ సుధాకర్ రెడ్డిని సంప్రదించగా ఇరిగేషన్ డీఈ ఈ నెల 27వ తేదీన ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కఠినంగా శిక్షించాలి : కల్లూరు చిన్న పెంచలయ్య, రాష్ట్ర యానాది సంఘం జిల్లా అధ్యక్షుడు
పూట గడిచేందుకు వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సంజీవయ్య అతని కుటుంబంపై మృగాల్లా వ్యవహరించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. వారిపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి.