తెలుగు తమ్ముళ్ల రౌడీయిజం
కొత్త సంవత్సర వేడుకల్లో టీడీపీ నాయకుల విధ్వంసకాండ
రామాపురంలో ఇళ్లపై పడి దాడులు
వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు తీవ్ర గాయాలు
ధ్వంసమైన బైక్‌లు, ఆటోలు, ఇంటి సామగ్రి
రామాపురం(నందివాడ) : నందివాడ మండలంలోని రామాపురం గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ గ్రామంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి వీరంగం సృష్టించారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఇళ్లపై పడి దొరికిన వస్తువును దొరికినట్లు ధ్వంసం చేశారు. ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే.. రామాపురం గ్రామం వైఎస్సార్ సీపీకి పట్టుకొమ్మ. అక్కడ సర్పంచ్ వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడుగా ఉండటంతో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో ఎలాగైనా దళితుల మధ్య చీలిక తీసుకువచ్చి లబ్ధి పొందాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఒకసారి వైఎస్సార్ సీపీ నేతలపై దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలపైనే బలమైన సెక్షన్‌లు పెట్టి జైలుకు పంపించారు.
న్యూ ఇయర్ వేడుకల వేళ మళ్లీ గొడవ
పాత కక్షలతో టీడీపీ సానుభూతిపరులు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న యువకులపై గొడవకు దిగారు. రాత్రి రెండు గంట సమయంలో బయటి గ్రామాల నుంచి మనుషులను తీసుకువచ్చి ఇళ్లపై దాడులకు దిగారు. దాడులను ప్రతిఘటించిన రుజుల సత్యనాథం, మొండ్రు కృష్ణ, కొత్తూరి రత్నరాజు, రుజుల సతీష్, వెన్న మరియన్న, వెన్న రాజేష్‌కు గాయాలయ్యాయి. వెన్న మరియన్న, రాజేష్‌ను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. సుమారు 10 మంది ఇనుపరాడ్లు, బరిసెలు, కత్తులతో తమపై దాడి చేసినట్లు వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. రెండు ఆటోలు, ఆరు బైక్‌లు, వంట సామాగ్రి, ఇతర వస్తువులు, ఇంటి పైకప్పులు సైతం ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ వర్గానికి చెందిన మేడేపల్లి జయరాజ్, బొడ్డు ప్రకాష్‌లు తమపై వైఎస్సార్ సీపీ నాయకులు దాడి చేసిగాయపరిచినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బసవరాజు తెలిపారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.