ఏరాసుపై టీడీపీ నాయకుల తిరుగుబాటు
– మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ
– గోడ దూకిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారంటూ అలక
– న్యాయం చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షుడికి వినతిపత్రం
కర్నూలు : పాణ్యం శాసనసభ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డిపై ‘తెలుగు తమ్ముళ్లు’ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల పుల్లారెడ్డి, జంపాల మధు, కల్లూరు మాజీ ఎంపీపీ బాల వెంకటేశ్వరరెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు పావులు కదుపుతున్నారు. రెండు రోజుల క్రితం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ఓ ఫంక‌్షణ్ హాల్‌లో పార్టీ సీనియర్ కార్యకర్తలంతా పుల్లారెడ్డి నాయకత్వంలో సమావేశమయ్యారు. పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై అధిష్టానాన్ని నిలదీయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ముందుగా సమస్య తీవ్రతను జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లి అప్పటికీ పరిష్కారం కాకపోతే అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలని సమావేశంలో నిర్ణయించుకున్నట్లు సమాచారం. కర్నూలు అర్బన్ పరిధిలో సీనియర్ కార్యకర్తలు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ మారిన వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తున్నారంటూ అధిష్టానాన్ని నిలదీసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా కర్నూలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం నాయకులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత చైర్మన్ శమంతకమణి కాల పరిమితి పూర్తి కావడంతో పలువురు నాయకులు ఆ పదవి కోసం పావులు కదుపుతున్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని మొదటి నుంచి ఆశిస్తున్న జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మల్లెల పుల్లారెడ్డి కూడా రెండవసారైనా న్యాయం చేయాలంటూ పదవి కోసం పోటీ పడుతున్నారు.
అయితే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన పెరుగు పురుషోత్తంరెడ్డి కూడా ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాపరెడ్డి ఆయనకు ఆశీస్సులు ఇవ్వడంతో సీనియర్ కార్యకర్తలంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మల్లెల పుల్లారెడ్డి, జంపాల మధు నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులు శుక్రవారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సోమిశెట్టిని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలను కాదని, ఇతర పార్టీ నుంచి వచ్చినవారికి పదవులు కట్టబెడితే ఊరుకునేది లేదని జిల్లా అధ్యక్షునితో వాదించినట్లు సమాచారం. అలాగే పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి ఎవరి పైన అయితే పోరాటం చేశామో వారే పార్టీలో కొత్తగా చేరి నియోజకవర్గ ఇన్‌చార్జి అండదండలతో నామినేటెడ్ పదవులు దక్కించుకుంటున్నారని వారు ఆక్రోశం వెల్లగక్కినట్లు సమాచారం.
మరికొన్ని పదవులకు కూడా పార్టీ మారినవారు పోటీ పడుతున్నారని, వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా సీనియర్ కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు వినతిపత్రంలో కోరారు. తమ విన్నపానికి ప్రాధాన్యత లభించకపోతే చలో అమరావతి పేరుతో సీఎం చంద్రబాబును కలిసేందుకు తిరుగుబాటు నాయకులు కార్యాచరణను సిద్ధం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.