పేట్రేగిన చింతమనేని
- కొల్లేరులో చేపల పెంపకాన్ని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
- అనుచరులతో వచ్చి దూషణలు, బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే
ఏలూరు రూరల్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. అక్రమ చేపల సాగును అడ్డుకున్న అటవీ శాఖ అధికారులపై జులుం ప్రదర్శించారు. కొల్లేరులో శనివారం జరిగిన ఈ సంఘటన అధికార పార్టీ నాయకుల దుర్మార్గాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంక పరిధి అటవీ భూమిలో 100 ఎకరాల విస్తీర్ణం గల 2 చెరువుల్లో చింతమనేని చేప పిల్లలు వేసేందుకు ప్రయత్నించారు. 10 లారీలలో చేప పిల్లలను చెరువు వద్దకు తరలించి అనుచరులకు సూచనలు చేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పెదపాడు, ఏలూరు, భీమడోలు అటవీ శాఖ డిప్యూటీ రేంజర్లు గంగారత్నం, వెంకటరెడ్డి, ఈశ్వర్ సిబ్బందితో చెరువుల వద్దకు చేరుకుని, చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న చింతమనేని 50 మంది అనుచరులతో చెరువు వద్దకు చేరుకుని ‘ఎవడ్రా ఇక్కడ పనులు అడ్డుకున్నది. ఏమనుకుంటున్నార్రా. ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. చెరువులో పిల్లలు వేయండి’ అని అనుచరులకు చెప్పాడు. అనుచరులు చెరువులో పిల్లలు వేసేందుకు మరోసారి ప్రయత్నించడం తో సిబ్బంంది అడ్డుపడ్డారు. రెచ్చిపోయిన చింతమనేని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. ఈ సంఘటనతో అధికారులు వెనక్కి తగ్గారు. ఇదే అదునుగా చూసుకుని ఆయన అనుచరులు చేప పిల్లలను చెరువుల్లో వేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగం ఫొటో లేదా వీడియో తీశారనే అనుమానంతో చింతమనేని అనుచరులు కొందరు అటవీశాఖ అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్స్ లాక్కుని ఫొటోలు డిలీట్ చేశారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఏలూరు రేంజర్ శ్రావణ్‌కుమార్ నిర్ణయించారు.