మేం చేసిన పాపమేంటి?
-
జ్యోత్స్న, కన్నబాబులకు అందని ఆహ్వానం
-
శిక్షణా తరగతుల సమాచారం కూడా ఇవ్వని టీడీపీ నాయకత్వం
-
–వలస నేతలకు పెద్ద పీట వేసి తమను అవమానించారని మధనపడుతున్న నేతలు
సాక్షి ప్రతినిధి – నెల్లూరు : పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి కేడర్‌కు అండగా నిలిచిన గూడూరు, ఆత్మకూరు నియోజక వర్గాల మాజీ ఇన్‌చార్జిలను శిక్షణా తరగతులకు ఆహ్వానించక పోవడం పట్ల తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా అవసరం కోసం వచ్చిన వారికి పెద్ద పీట వేయడం పట్ల కేడర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు నుంచి డాక్టర్ జ్యోత్స్నలత, ఆత్మకూరు నుంచి గూటూరు కన్నబాబు టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత కూడా వీరు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్‌కు అందుబాటులో ఉంటూ వచ్చారు. రెండేళ్ల తర్వాత గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కమార్ వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అధిష్టానం ఆయనకే అప్పగించింది. అప్పటి దాకా ఇన్‌చార్జిగా ఉన్న జ్యోత్స్నకు, సునీల్‌కు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారిని, ఎన్నికల్లో తనకు సహకరించిన వారిని పక్కన పెట్టి ఎమ్మెల్యే తన మనుషులకు పెద్ద పీట వేస్తున్నారని జ్యోత్స్న వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంట్రాక్టులు, ఇతర పనులు కూడా ఎమ్మెల్యే ఏకపక్షంగా పంచేస్తున్నారని ఆ వర్గం పార్టీ జిల్లా నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం శృతి మించడంతో సునీల్ మినహా పార్టీలో ముఖ్యమైన ఇతర నాయకులు మిన్నకుండిపోయారు. ఆత్మకూరు నియోజకఽవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. తొలి నుంచి పార్టీలో ఉంటూ, ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న గూటూరు కన్నబాబును ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా రగిలిపోయిన కన్నబాబును పార్టీ హై కమాండ్ బుజ్జగించింది. అయితే ఇప్పటికి కూడా ఆనంతో కన్నబాబు, ఒక వర్గంతో మరో వర్గం కలిసేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు.
మరో అవమానం
గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు ఎమ్మెల్యే సునీల్, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. నిన్న, మొన్నటి వరకు ఆ నియోజకవర్గాల్లో పార్టీని మోసిన జ్యోత్స్న, కన్నబాబుకు అసలు సమాచారమే పంపలేదు. ఈ విషయాన్ని వీరిద్దరూ అవమానంగా భావిస్తున్నారు. పెద్ద నాయకుల పరిస్థితే ఇలా ఉంటే రేప్పొద్దున తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ద్వితీయ శ్రేణి నాయకులు ఆలోచనలో పడ్డారు. అవసరం కోసం వాడుకుని కూరలో కరివేపాకులా తీసిపారేసే పద్ధతి మార్చుకోక పోతే రాబోయే ఎన్నికల్లో తామెలా పనిచేయాలని కేడర్ అంతర్మథనంలో పడింది. మొత్తం మీద ఈ వ్యవహారం ఆ రెండు నియోజకవర్గాల్లోని పార్టీ గ్రూపుల మధ్య ఉన్న దూరం మరింత పెంచింది.