
ఇదెక్కడి సోకు.!
పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్మునే... అభివద్ధి పనులకు నిధుల పేరుతో ప్రభుత్వాలు తిప్పుతున్నాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ తమ వల్లనే ఆ అభివద్ధి జరిగిందంటూ గొప్పలు పోతున్నారు టీడీపీ ప్రజాప్రతినిధులు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కొత్తగా నిర్మించిన బస్‌షెల్టర్లు ఇందుకు అద్దం పడుతున్నాయి.
రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో ఇటీవల కొత్తగా బస్సు షెల్టర్లను ప్రారంభించారు. చెన్నేకొత్తపల్లిలో నిర్మించిన ప్రాంగణానికి రూ. 9లక్షలు (ఎంపీ కోటా, ఎస్‌డీఎఫ్ నిధులు), రామగిరి మండలంలోని నసనకోట, వెంకటాపురం గ్రామాల్లో, కనగానపల్లిలో నిర్మించిన ప్రాంగణాలకు రూ. 4 లక్షలు చొప్పున ఖర్చు చేశారు.
వీటి నిర్మాణాలకు స్థానిక ప్రజాప్రతినిధులు గాని, దాతలు గాని ఎలాంటి విరాళాలు ఇవ్వలేదు. ప్రజాధనంతో నిర్మితమైన ఈ ప్రాంగణాలకు మంత్రి సునీత కుటుంబసభ్యులు తమ సొంత డబ్బుతో నిర్మించి ఇచ్చినట్లుగా పరిటాల రవి జ్ఞాపకార్థం అంటూ బోర్డు ఏర్పాటు చేయడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. సొమ్ము ఒకరిదైతే... సోకు ఇంకొకరిదంటే ఇదేనేమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.