రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
-
26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో రైతుదీక్ష
-
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
టవర్‌సర్కిల్ : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, ఎక్స్‌గ్రేషియా విషయంలో జిల్లాకో రకమైన నీతి పాటిస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 339 మంది ఉన్నారని, అయితే 76 మందే చనిపోయినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోందన్నారు. కేవలం 15 మందికి రూ.1.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారని తెలిపారు. మెదక్ జిల్లాలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.6లక్షలు ఇచ్చారని అన్నారు. మెదక్‌లో మాత్రమే పూర్తిస్థాయిలో ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం, మిగతా ప్రాంత రైతు కుటుంబాలను విస్మరించడం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, ఎక్స్‌గ్రేషియా, రుణాల మంజూరు తదితర సమస్యలపై ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కుల వద్ద చేపట్టే రైతు ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు తాజొద్దీన్, గంట రాములు, కళ్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీనివాస్, పుట్ట నరేందర్, దామెర సత్యం, చెల్లోజి రాజు, జాడి బాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్, దూలం రాధిక, తీట్ల ఈశ్వరి, మాదవి, ఇందు, వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్ అధ్యక్షుడిగా నియమితులైన తాజొద్దీన్‌ను పార్టీ నాయకులు సన్మానించారు.