కదిరిలో పచ్చ రచ్చ
ఎమ్మెల్యే చాంద్‌బాషా, పార్టీ ఇ¯ŒSచార్జ్ కందికుంట వర్గీయుల మధ్య ఘర్షణ
కదిరి : అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, ఎమ్మెల్యే చాంద్‌బాషా వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ చిన్న కారణం దొరికినా ఆ సాకుతో గొడవలకు దిగుతున్నారు. గురువారం పట్టణంలోని వలీసాబ్ రోడ్‌లో ఇరువర్గాల మధ్య ఫ్లెక్సీ గొడవ జరిగింది. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకోకపోతే పరిస్థితి అదుపు తప్పేది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జనచైతన్య యాత్రలకు సంబంధించి ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరులు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ స్థానిక వలీసాబ్‌రోడ్‌లో రెండు రోజుల క్రితం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
అందులో ఎమ్మెల్యే అనుచరుడు మస్తాన్ ఫొటోకు గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక ఎవరో పెన్నుతో మీసాలు గీశారు. ఆ దృశ్యాన్ని ఫేస్‌బుక్‌లో కూడా పెట్టారు. చివరకు ఆయన ఫొటోను పూర్తిగా చింపేశారు. మస్న్బంధువులు ఫేస్‌బుక్ ద్వారా ఈ దృశ్యాన్ని చూసి, వెంటనే ఆయనకు ఫోన్ చేశారు. ఎవరు అలా చేశారని అడగడంతో ఆయన మనస్తాపానికి గురై ఎమ్మెల్యే అనుచరులతో చెప్పి బాధపడ్డారు.
దీంతో వారంతా ఏకమై మాజీ కౌన్సిలర్ పరికి షామీర్ ఆ పని చేశాడని భావించారు. షామీర్ ఆ వీధిలోకి రాగానే గొడవకు దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా ఆ వీధిలోకి రావడంతో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. షామీర్‌పై దాడికి దిగారు. దీంతో కందికుంట అనుచరులు షామీర్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో గొడవ పెద్దదైంది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్‌ఐలు గోపాలుడు, ఉగాది వెంకట ప్రసాద్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని గుంపును చెదరగొట్టారు. వెంటనే ఆ వీధిలో దుకాణాలు, టీ కొట్టులను మూయించారు. రోజంతా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.