kandikunta prasad
-
కందికుంట.. నీటి తంటా
- ట్యాంకర్ డ్రైవర్‌కు బెదిరింపు - ట్యాంకర్‌పై ఉన్న ఫ్లెక్సీల చింపివేత కదిరి: పట్టణవాసులకు ఉచితంగా సరఫరా చేస్తున్న తాగునీటిని టీడీపీ నాయకుడు కందికుంట అడ్డుకున్నారు. ఆయన అనుచరులు శనివారం వీరంగం సృష్టించి నీటిని సరఫరా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్‌ను బెదిరించి ట్రాక్టర్‌పై ఉన్న ఫ్లెక్సీలను బలవంతంగా తొలగించారు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణానికి మంచినీరు సరఫరా అవుతున్న పార్నపల్లి రిజర్వాయర్ పూర్తిగా అడుగంటడంతో కొద్ది రోజులుగా కదిరికి తాగునీరు సరఫరా కావడం లేదు. ప్రజల ఇబ్బందిని గమనించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి కొన్ని రోజులుగా 3 ట్యాంకర్లు ఏర్పాటు చేసి పట్టణమంతా నీరు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వీటి మూలంగా పట్టణంలో నీటి సమస్య కొంతవరకు తీరింది. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ మంచినీటిపై కూడా దిగజారుడు రాజకీయానికి దిగారు. శనివారం సిద్ధారెడ్డికి సంబంధించిన నీటి ట్యాంకర్ డ్రైవర్‌ను కందికుంట అనుచరులు బెదిరించారు. చొక్కా పట్టుకుని ‘కందికుంట అన్న’ పిలుస్తున్నాడంటూ బలవంతంగా కందికుంట ఇంటి దగ్గరకు లాక్కెళ్లారు. ‘రేయ్ ఎవర్రా నీకు మంచినీళ్లు సరఫరా చేయమని చెప్పింది?’ అని కందికుంట ప్రశ్నించాడు. ఇందుకు ట్యాంకర్ డ్రైవర్ డా.సిద్దారెడ్డి సార్ చెబితే వార్డులో నీళ్లు ఫ్రీగా సరఫరా చేస్తున్నాం’ అని సమాధానమిచ్చాడు. ఇందుకు ఆగ్రహించిన కందికుంట రేయ్ వెంటనే ఆ ట్యాంకర్‌పై ఉన్న స్టిక్కర్‌ను తొలగించండి అంటూ ఆయన అనుచరులను ఆదేశించాడు. వెంటనే వారు స్టిక్కర్లను తొలగించారు. చేసేదేం లేక ట్యాంకర్ డ్రైవర్ భయంతో వెనుదిరిగాడు. కందికుంట జోక్యంతో మంచినీటి సరఫరా శనివారం మధ్యాహ్నం నుంచి ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కదిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం
అనంతపురం : అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ సీపీ నమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్లను మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వర్గీయులు అడ్డుకున్నారు. డ్రైవర్‌పై కందికుంట వర్గీయులు దాడి చేసి, ఫ్లెక్సీలు చించివేశారు. ఈ ఘటనపై సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని, తాగునీటి సమస్య తీరుస్తుంటే ఆటంకాలు సృష్టించడం దుర్మార్గమన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కదిరిలో పచ్చ రచ్చ
ఎమ్మెల్యే చాంద్‌బాషా, పార్టీ ఇ¯ŒSచార్జ్ కందికుంట వర్గీయుల మధ్య ఘర్షణ కదిరి : అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, ఎమ్మెల్యే చాంద్‌బాషా వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ చిన్న కారణం దొరికినా ఆ సాకుతో గొడవలకు దిగుతున్నారు. గురువారం పట్టణంలోని వలీసాబ్ రోడ్లో ఇరువర్గాల మధ్య ఫ్లెక్సీ గొడవ జరిగింది. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకోకపోతే పరిస్థితి అదుపు తప్పేది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జనచైతన్య యాత్రలకు సంబంధించి ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరులు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ స్థానిక వలీసాబ్‌రోడ్‌లో రెండు రోజుల క్రితం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే అనుచరుడు మస్తాన్ ఫొటోకు గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక ఎవరో పెన్నుతో మీసాలు గీశారు. ఆ దృశ్యాన్ని ఫేస్బుక్లో కూడా పెట్టారు. చివరకు ఆయన ఫొటోను పూర్తిగా చింపేశారు. మస్న్బంధువులు ఫేస్బుక్ ద్వారా ఈ దృశ్యాన్ని చూసి, వెంటనే ఆయనకు ఫోన్ చేశారు. ఎవరు అలా చేశారని అడగడంతో ఆయన మనస్తాపానికి గురై ఎమ్మెల్యే అనుచరులతో చెప్పి బాధపడ్డారు. దీంతో వారంతా ఏకమై మాజీ కౌన్సిలర్ పరికి షామీర్ ఆ పని చేశాడని భావించారు. షామీర్ ఆ వీధిలోకి రాగానే గొడవకు దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా ఆ వీధిలోకి రావడంతో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. షామీర్పై దాడికి దిగారు. దీంతో కందికుంట అనుచరులు షామీర్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో గొడవ పెద్దదైంది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్ఐలు గోపాలుడు, ఉగాది వెంకట ప్రసాద్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని గుంపును చెదరగొట్టారు. వెంటనే ఆ వీధిలో దుకాణాలు, టీ కొట్టులను మూయించారు. రోజంతా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
కదిరిలో కల్లోలం
- ఎమ్మెల్యే చాంద్‌బాషాకు ప్రాధాన్యంపై టీడీపీ కేడర్‌లో అసంతృప్తి – జనచైతన్య యాత్రలకు కందికుంట వర్గం దూరం –మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటున్న పార్టీ శ్రేణులు –మంత్రి కొల్లు రవీంద్ర వద్ద పంచాయితీ కదిరి : కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ‘ముందొచ్చిన చెవులు కన్నా వెనుకొచ్చిన కొమ్ములే వాడి’ అన్న చందంగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌ను కాదని.. ఈ మధ్యే తన స్వార్థం కోసం మళ్లీ టీడీపీలో చేరిన ఎమ్మెల్యే చాంద్‌బాషాకే పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధిష్టానం తీరులో మార్పు రాకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని మండలాల కన్వీనర్లు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రులు కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఎదుట కూడా తేల్చిచెప్పారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. టీడీపీ అధిష్టానం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పత్రాలతో పాటు ట్యాబ్‌లతో కూడిన సాంకేతిక పరికరాలను సభ్యత్వ నమోదు ప్రారంభానికి ముందురోజు కందికుంట ఇంటికి పంపింది. తర్వాత ఏం జరిగిందో కానీ ఆ మరుసటి దినమే వాటన్నింటినీ ఎమ్మెల్యే చాంద్‌బాషా ఇంటికి చేర్చమని పార్టీ ఆదేశించింది. దీంతో మొత్తం సామగ్రి చాంద్ ఇంటికి తరలించారు. తొలిరోజు మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం కందికుంట ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతానని చెప్పి ఆఖరు నిమిషంలో హ్యాండిచ్చారు. పార్టీ ఎందుకు తనను ఇలా అవమానానికి గురిచేస్తోందంటూ కందికుంట తన అనుచరులు, పార్టీ మండల నాయకుల ఎదుట అసంతృప్తితో రగిలిపోయారు. వెంటనే ఆయన తనకు జరిగిన అవమానాన్ని మంత్రి సునీత దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్రకు అప్పగించింది. రాజీనామాలకు సిద్ధమన్న పార్టీ శ్రేణులు మంత్రి కొల్లు రవీంద్ర కందికుంట, చాంద్‌బాషా మధ్య సయోధ్య కుదుర్చేందుకు రంగంలోకి దిగారు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక జిల్లా కేంద్రానికి పిలిపించి అక్కడి మునిసిపల్ అతిథి గృహంలో సుమారు రెండు గంటల సేపు పంచాయితీ చేశారు. తొలుత ఇరువర్గాలను కలిపి, ఆ తర్వాత వేర్వేరుగా మాట్లాడారు. 'కందికుంట పార్టీ కోసం 15 ఏళ్లుగా కష్టపడుతున్నారు. కానీ స్వార్థం కోసం పార్టీ మారి, డబ్బుకోసం కక్కుర్తి పడి తిరిగొచ్చిన ఎమ్మెల్యే చాంద్‌బాషాకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములే మీకు ఎక్కువైనాయి. అలాంటప్పుడు మేమంతా ఈ పార్టీలో ఎందుకుండాలి? పార్టీకి, మా పదవులకు రాజీనామాలు చేస్తాం' అంటూ నియోజకవర్గంలోని పలువురు టీడీపీ మండల కన్వీనర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మంత్రి కొల్లు ఎదుట ముక్త కంఠంతో చెప్పారు. ఆ తర్వాత చాంద్ వర్గీయులు కూడా తమ వాదన విన్పించారు. 'వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు అక్కడ నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగించారు. కదిరిలో కూడా అలాగే చేయండ’ని కోరారు. అయితే.. చివరకు కందికుంట వర్గీయులు అలిగి ఆగ్రహంలో బయటకు వచ్చేశారని తెలిసింది. ఈ పరిణామాలను మంత్రులతో పాటు జిల్లా నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆయన తనయుడు లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూసి.. ఆ తర్వాత తమ తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని కందికుంట వర్గం చెబుతోంది. -
చాంద్‌బాషా చేరికతో అనంతలో ముసలం
విజయవాడ : అనంతపురం టీడీపీలో ముసలం మొదలైంది. కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా చేరికతో అసమ్మతి తీవ్రస్థాయిలో చెలరేగింది. చాంద్‌బాషా చేరికపై కదిరి టీడీపీ ఇంఛార్జ్ కందికుంట ప్రసాద్... టీడీపీ నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. చాంద్‌బాషా చేరిక నేపథ్యంలో ఈ రోజు ఉ. 9.30 గంటలకు సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో టీడీపీ అగ్రనేతలు...ప్రసాద్‌తో మంతనాలు సాగించారు. దీంతో ఆయన్ని శాంత పరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంత్రి పరిటాల సునీత జోక్యం చేసుకుని... ప్రసాద్‌ను చంద్రబాబు వద్దకు స్వయంగా తీసుకునివెళ్లారు. చాంద్ బాషా చేరికపై చంద్రబాబు ఎదుటే ప్రసాద్ అసంతృప్తి వ్యక్త చేశారు. దీంతో చాంద్ బాషా చేరిక ప్రక్రియ పూర్తికాకుండానే ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.