విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో కొణతాల రామకృష్ణ చేరికపై విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో నిరసనలు కొనసాగుతున్నాయి. నూకాంబిక అమ్మవారి ఆలయం నియోజకవర్గం కమిటీ మంగళవారం అనకాపల్లిలో సమావేశమైంది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో సదరు సమావేశం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.
కొణతాల గోబ్యాక్ అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కొణతాల చేరికపై స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. ఇది పార్టీ సమావేశం కాదంటూ స్థానిక ఎమ్మెల్యే కార్యకర్తలకు బదులు ఇచ్చారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు.
విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత కొణతాల రామకృష్ణ త్వరలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలే ఆయన మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడుతో కలసి హైదరాబాద్లో చంద్రబాబుతో సమావేశమయ్యారు. కొణతాలను ఈ సందర్భంగా పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం. అందుకు సంక్రాంతి పండగ వెళ్లిన వెంటనే కొణతాల టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని జిల్లాలోని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే కొణతాల రాకను టీడీపీలోకి మరో మంత్రి గంటా వర్గం తవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కొణతాల రాకపై గంటా శ్రీనివాసరావు మంగళవారం స్పందించారు. కొణతాల పార్టీలోకి తీసుకోవడంపై అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరు పాటించాల్సిందేనని గంటా స్పష్టం చేసిన విషయం విదితమే.