
జూన్‌లోగా 15 వేల టీచర్ పోస్టుల భర్తీ
సంగెం: విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు కషి చేయాలని సూచించారు. వరంగల్ జిల్లా సంగెంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం, గవిచర్లలోని మోడల్ స్కూల్, హాస్టల్ భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే జూన్‌లోగా రాష్ట్రంలో 15 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
విద్యారంగానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, కేజీ టు పీజీ విద్యను అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నారని కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో మొదటి దశలో నిర్మించిన 192 మోడల్ స్కూళ్లల్లో 190 పనిచేస్తున్నాయని, ఒక్కో స్కూల్‌కు రూ.3 కోట్లు, హస్టళ్లకు 1.28 కోట్లు వెచ్చించామని తెలిపారు. మోడల్ స్కూళ్ల ప్రహరీలకు రూ.50 కోట్లు, కేజీబీవీల ప్రహరీలకు రూ. 40 కోట్లు మంజూరు చేశామన్నారు. కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదో పీఆర్‌సీ అమలు చేస్తామని కడియం హామీ ఇచ్చారు.