సమాచారం ఇవ్వకుండా విధులకు ఎగనామం
తిప్పర్తి : ఎవరికేంది సమాచారం ఇచ్చేదీ.. ఎవరొచ్చి చూస్తారిక్కడ.. అని అనుకున్నారేమో పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు ఎగనామం పెట్టేశారు ఆ ఉపాధ్యాయులు. పేరుకేమో ఐదుగురు ఉపాధ్యాయులు.. మంగళవారం వచ్చింది మాత్రం ఒక్కరే.. ఇది మండల మండలంలోని గోదోరిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరు. ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఆటలాడారు. ఇది గమనించిన గ్రామస్తులు ఆరా తీసి ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడితో సహా ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై మరో పాఠశాలకు పంపించారు. పాఠశాలలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నారు.
నిబంధనలు ఇలా..
మొత్తం పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులుంటే ఇద్దరికి మాత్రమే సెలవు ఇచ్చేందుకు నిబంధనలు ఉన్నాయి. అలాగే ప్రధానోపాధ్యాయులు సెలవు కావాలంటే ఎంఈఓకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. అయితే గోదోరిగూడెం పాఠశాలలో మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులు సెలవు పెట్టగా, మరో ఉపాధ్యాయుడు అత్యవసర పనిపై లీవ్ కావాలని హెచ్‌ఎంకు తెలిపారు. ఇదిలా ఉంటే హెచ్‌ఎం కూడా మండల విద్యాధికారికి సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు ఎగనామం పెట్టారు. ఇలా ఎవ్వరికీ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెమో జారీ – అరుణ శ్రీ, మండల విద్యాధికారి
సమాచారం ఇవ్వకుండా విధులకు ఎగనామం పెట్టిన హెచ్‌ఎంకు మెమో జారీ చేశాం. అలాగే ఒకేసారి ముగ్గురు ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వడంపై కూడా వివరణ ఇవ్వాలని హెచ్‌ఎంకు సూచించాం. నిబంధనల ప్రకారం ఒకేసారి ముగ్గురు ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వకూడదు.