మోగుతున్న వాయిదాల ‘గంట’
– తొలుత ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ఉంటుందని ప్రకటన
– కౌన్సెలింగ్‌కు ముందు జీఓ విడుదలతో నేటికి వాయిదా
– సాయంత్రం జరగాల్సిన సోషల్ టీచర్ల కౌన్సెలింగ్ కూడా..
టీచర్ల బదిలీల విషయంలో విద్యాశాఖ విడుదల చేస్తున్న జీవోలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. బడిలో మోగాల్సిన గంట బదిలీల ప్రహసనంలో మూగబోతోంది. వాయిదాల పర్వంతో ఉపాధ్యాయులు అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గురువారం మరోసారి వాయిదాల గంట మోగింది. బుధవారం మిగిలిపోయిన ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ టీచర్లతో పాటు ఎస్జీటీలకు 1–250 వరకు గురువారం ఉదయం కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు ముందురోజు ప్రకటించారు. ఉదయం 10 గంటలకే అందుబాటులో ఉండాలని హెచ్చరించడంతో 8 గంటలకే సైన్స్ సెంటర్‌కు టీచర్ల తాకిడి ప్రారంభమైంది. తీరా 12 గంటల సమయంలో కొత్తగా జీఓ విడుదల చేయడంతో కలకలం రేగింది. విద్యార్థుల సంఖ్య 5లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలను మాత్రమే మూసివేయాలని తాజా జీఓ సారాంశం. ఆ స్కూళ్లకు పోస్టుల కేటాయింపు తదితర కసరత్తు చేసే క్రమంలో ఎస్జీటీల కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
కౌన్సెలింగ్‌కు రావాలంటూ సోసియల్ టీచర్లకు మెసేజ్‌లు
ఎస్జీటీల కౌన్సెలింగ్ వాయిదా పడడంతో వారి స్థానంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటలకు సీనియార్టీ జాబితాలో ఉన్న సోషల్ టీచర్లందరూ రావాలంటూ ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చారు. దీంతో మారుమూల స్కూళ్లలో ఉండే టీచర్లకు ముచ్చెమటలు పట్టాయి. హుటాహుటిన కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు సిద్ధమవుతుండగా వాయిదా వేస్తున్నట్లు మరో ఎస్‌ఎంఎస్ ఇచ్చారు.
సపరేట్‌గా హైలెట్ చేయాలి
శుక్రవారం సోషల్ టీచర్లు, పండిట్లకు కౌన్సెలింగ్ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ప్రకటించారు. సోషల్ టీచర్లు ఉదయం 7 గంటలకు, పండిట్లు ఉదయం 8 గంటలకు సైన్స్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. సీనియార్టీ జాబితాలోని 1–300 వరకు హాజరుకావాలని డీఈఓ కోరారు.