టీచర్ల పదోన్నతులకు సర్వం సిద్ధం!
టీచర్ల పదోన్నతులకు సర్వం సిద్ధం!
Published Sat, Aug 27 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
– 185 మందికి పదోన్నతులు
– త్రిసభ్య కమిటీ ఆమోదమే తరువాయి
– ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్న డీఈఓ
ఉపాధ్యాయుల పదోన్నతులకు సర్వం సిద్ధమైంది. మొత్తం 185 మంది ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లకు పదోన్నతులు లభిస్తాయి. ఇందులో 93 స్కూల్ అసిస్టెంట్లు, 92 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు నేడో, రేపో కలెక్టర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఆమోదానికి పదోన్నతుల ఫైల్ పంపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పదోన్నతులపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని శనివారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించారు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 2931 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం పదవి విరమణ వయస్సును రెండేళ్లు అదనంగా పెంచడంతో గత రెండేళ్లుగా పదోన్నతులకు బ్రేక్ పడింది. అంతకుముందు నెలనెలా పదోన్నతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు ఉపాధ్యాయులు పదవి విరమణ చేయడం, ఖాళీగా ఉన్న పోస్టుల్లో 70 శాతం పదోన్నతులతో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో జిల్లాలో మొత్తం 185 మంది ఎస్జీటీలకు పదోన్నతులు లభించే అవకాశం ఏర్పడింది. ఇందులో 93 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా, 92 మందికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభిస్తుంది.
త్రిసభ్య కమిటీ ఆమోదానికి పదోన్నతుల ఫైల్
పదోన్నతుల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఊరట లభించింది. నేడో రేపో పదోన్నతుల ఫైల్‌ను కలెక్టర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఆమోదానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిసభ్య కమిటీలో కలెక్టర్, జెడ్పీ చైర్మన్, డీఈఓ సభ్యులుగా ఉంటారు. వారు ఆమోదం తెలిపితే సెప్టెంబర్ 6, 7 తేదీల్లో పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహణ జరిగే అవకాశం ఉంది.
ఆర్‌జేడీకి హెచ్‌ఎంల పదోన్నతుల ఫైల్
మరోవైపు ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు ఆర్‌జేడీ ఆమోదం తెలపాలి. ఇందుకు సంబంధించిన ఫైల్ ఒకటి రెండు రోజుల్లో ఆర్‌జేడీ వద్దకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు డీఈఓ నుంచి హెచ్‌ఎంల పదోన్నతి ఫైల్ వస్తే ఆమోదం తెలుపుతానని శనివారం కర్నూలుకు వచ్చిన ఆర్‌జేడీ ప్రేమానందం వివరించారు.
ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరించిన డీఈఓ
ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను డీఈఓ బ్లాగ్‌లో ఉంచారు. విభాగాలు, సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితా అందులో ఉంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఎస్‌ఎస్‌ఏ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ముఖ్యంగా అర్‌ఎంఎస్‌ఏ ప్రధానోపాధ్యాయుల పోస్టులపై నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని సంఘాల నాయకులు కోరారు. అందుకు డీఈఓ స్పందిస్తూ జిల్లాకు మంజూరైన 28 ఆర్‌ఎంఎస్‌ఏ హెచ్‌ఎం పోస్టులను రద్దు చేయడానికి కోర్టుకు వెళ్లుతామని, అంతవరకు తాత్కాలికంగా 28లో ఎలాంటి అభ్యంతరాలు లేని మూడు పోస్టులను కలుపుకుని పదోన్నతులుSకల్పిస్తామని వివరించారు. ఇందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా సమ్మతించారు.
సబ్జెక్టుల వారీగా పదోన్నతులు కల్పించే పోస్టులు
కేటగిరి మీడియం జెడ్పీ గవర్నమెంట్ మొత్తం
ఎస్‌ఏ( ఇంగ్లిషు) తెలుగు 10 04 14
ఎస్‌ఏ(సోషల్) తెలుగు 23 04 27
ఎస్‌ఏ బయోసైన్స్ తెలుగు 07 02 09
ఎస్‌ఏ బయోసైన్స్ కన్నడ 02 02
ఎస్‌ఏ మ్యాథ్‌్స తెలుగు 11 04 15
ఎస్‌ఏ మ్యాథ్‌్స ఉర్దూ 0 05 05
ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్‌తెలుగు 09 05 14
ఎస్‌ఏ పీడీ తెలుగు 0 01 01
ఎస్‌ఏ తెలుగు తెలుగు 05 01 06
ఎస్‌ఏ హిందీ తెలుగు 03 0 03
పీఎస్‌హెచ్‌ఎం తెలుగు 75 00 75
పీఎస్‌హెచ్‌ఎం కన్నడ 02 00 02
హెచ్‌ఎస్ హెచ్‌ఎం తెలుగు 15
మొత్తం 147 29 185
6, 7 తేదీల్లో కౌన్సెలింగ్ : రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ
సెప్టెంబర్ 6, 7 తేదీల్లో పదోన్నతులకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్రిసభ్య కమిటీ ఆమోదం ఈ నెలలో తెలిపితే ఇదే నెలలో జరుపుతాం. వచ్చే నెలలో ఆమోదం లభిస్తే 5న టీచర్స్ డే వేడుకలు ఉంటుండడంతో ఆరు, ఏడు తేదీల్లో జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.
Advertisement