
యువకుడి ప్రాణం తీసిన క్రికెట్
శ్రీకాకుళం : సరదాగా ఆడుకుంటున్న క్రికెట్ ఆట ప్రాణాల మీదకు తెచ్చింది. మాటా మాటా పెరగడంతో జరిగిన గొడవ చివరకు బ్యాట్లతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని చిన్న బొందిలీపురంలో శనివారం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలనీలో క్రికెట్ ఆడుకుంటున్న కొందరు యువకుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన టి.కిషోర్ అనే యువకుడు తన చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో అంజనీ కుమార్(19) తలపై కొట్టాడు. ఆ దెబ్బతో అంజనీ కుమార్ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.