
తెలంగాణ ఇప్పించింది నేనే: సర్వే
సుందరయ్య విజ్ఞానకేంద్రం: సోనియాను ఒప్పించి తెలంగాణ ఇప్పించింది తానేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అనేక మంది తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు, ఇంకా ఆలస్యం చేస్తే తెలంగాణ కాలిపోతోందని, సోనియా జన్మదినం రోజు ఆమె ఒప్పించి ప్రకటన చేయించానని అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ దళిత సాహిత్య అకాడమి(బీడీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ‘ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన విధానం – బీసీ,ఎస్సీ, ఎస్టీ సంఘాల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వే మాట్లాడుతూ తెలంగాణ రావటానికి దళితులే ప్రధాన కారణమన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మోసం చేశాడని ఎద్దేవా చేశారు. ఎంసెట్ లీకేజీలో కన్వీనర్, డిప్యూటీ సీఎంను ఎందుకు పదవుల నుంచి తొలగించటం లేదని ప్రశ్నించారు. వారి వెనుక కేటీఆర్ ఉన్నందుకే చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. బీడీఎస్‌ఏ తెలంగాణ అధ్యక్షులు నల్లా రా«ధాకృష్ణ, ఛీప్ కో–ఆర్డినేటర్ ఇనుగాల భామ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.