ఆమె అయితే వద్దు... అతడు అయితే ఒకే
ఒక మహిళా ఎంపీ అంటేనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారట. ఆ నోటిదురుసుతనం, ఫైర్‌బ్రాండ్ తత్వంతో కేంద్రమంత్రి పదవిని సైతం నిర్వహించినా ఈమె పొడ అంటేనే టీ నాయకులకు గిట్టడం లేదు. ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఈ నాయకురాలు తెలంగాణకు అవసరంలేదని తేల్చి చెబుతున్నారట. అంతగా కాకపోతే తండ్రి వారసత్వం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాంగ పదవిని సైతం నిర్వహించిన మృదుస్వభావి అయిన ఓ నాయకుడు తెలంగాణకు వచ్చినా సరిపోతుందంటున్నారు. ఫైర్‌బ్రాండ్, మృదుస్వభావి ఈ ఇద్దరు నేతలకు కూడా హైదరాబాద్‌కు చెందినవారే కాకుండా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తాను గతంలో ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ చేసినా హైదరాబాద్‌లో కార్పొరేటర్‌గా ఉన్నా తెలంగాణలో నాయకులు పట్టించుకోవడంలేదు కాబట్టి తాను కూడా ఏపీ రాజకీయాలకు వెళతానని ఆ మహిళ ఎంపీ సన్నిహితులతో అంటున్నారట. ఏపీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటా... ఏపీ సీఎం చంద్రబాబుకు ఏకుమేకుగా త యారవుతానని ఆమె సవాల్ కూడా విసురుతున్నారట. మరోవైపు మృదుస్వభావినేత వస్తే కాంగ్రెస్ తరుపున సెటిలర్ల ఓట్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారట. ఈయన తెలంగాణకు రాకుండా రాష్ట్ర పాలన ఇన్‌చార్జీ అడ్డుకోకుండా హైకమాండే చొరవ తీసుకుంటే మంచిదనే ఆలోచనలో ఈ నేతలు ఉన్నారట.