విద్యార్థులకు జ్ఞాపికను అందజేస్తున్న దేశపతి శ్రీనివాస్
-
‘టీవీఎస్’ జిల్లా ప్రథమ మహాసభలో దేశపతి శ్రీనివాస్
కొత్తగూడెం అర్బన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అంతా ఉద్యమించామని, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలను పొందుతున్నామని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్‌లో సంఘం జిల్లా ప్రథమ మహాసభలో ప్రసంగించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తొలి జిల్లా ఖమ్మంఅని, అందులో కొత్తగూడెం చైతన్యవంతమైన ప్రాంతమని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల కాలంలో మాదిరి కాకుండా..ఇప్పుడు ప్రజలు నేరుగా తమ ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకునే రోజులొచ్చినయన్నారు. ప్రభుత్వం కూడా అన్ని వర్గాలవారి సంక్షేమం కోసం భూ పంపిణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శులు విజయభాస్కర్‌రెడ్డి, వెంకన్న, గిరిజన విభాగం నాయకులు మాలోత్ బిక్షపతినాయక్, రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సోషల్ ఫౌండేషన్ నర్సింహరెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ అయితా శ్రీధర్, జిల్లా అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాలతో విజ్ఞానం..
పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పొందొచ్చని ప్రముఖ కవి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో కథా, కవితా రచన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. చిన్నారులకు ఉత్సాహాన్ని నింపే ఉత్సవం బాలోత్సవ్ మాత్రమేనని అన్నారు. విద్యార్థులు జాలి, కరుణ, దయ పంచే వారుగా తయారు కావాలన్నారు. ఎక్కడైతే కళలు గొప్పగా ఉంటాయో అక్కడ సమాజం బాగుంటుందని చెప్పారు. బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ..విద్యార్థులు కవితలు, కథలు రాయడం, చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కవులు, కథకులు పెద్దింటి అశోక్, కుప్పిలి పద్మ, వాసిరెడ్డి నవీన్, పద్మారావు, మాధవరావు, బాల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.