- భాషాప్రియుల మనోగతం
- వచ్చే నెల 5న ఉన్నతస్థాయి సమావేశం
విశాఖలోనే తెలుగు కేంద్రం నెలకొల్పాలి
Published Mon, Aug 8 2016 11:59 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
సాక్షి, విశాఖపట్నం : తెలుగు వారి చిరకాల ఆకాంక్ష.. ఎట్టకేలకు నెరవేరింది. తెలుగు భాషకు ప్రాచీన హోదాపై ఇన్నాళ్లూ ఉన్న అడ్డంకి తొలగిపోయింది. చాన్నాళ్లుగా తెలుగుకు ప్రాచీన భాష హోదాకు తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడుతూ వచ్చింది. ఏళ్ల తరబడి నలుగుతూ వచ్చిన ఈ వివాదానికి మద్రాసు హైకోర్టు తెరవేసింది. తెలుగుకు ప్రాచీన హోదాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు యావత్ తెలుగు జాతిలోనూ సంబరాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు క్లాసికల్ సెంటర్ ఏర్పాటుపైనే అందరి దష్టి కేంద్రీకతమై ఉంది. విశాఖలోనే ఆ సెంటరు ఏర్పాటుకు అనుకూలమన్న వాదన వినిపిస్తోంది. ప్రాచీన హోదా దక్కిన నేపథ్యంలో సంబంధిత భాషాభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తుతంది. వీటితో కేంద్రం ఏర్పాటుతో పాటు తెలుగు భాష విస్తతికి అవసరమైన అన్నిటిని సమకూర్చుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగువారుండే రాష్ట్రాలు రెండయ్యాయి. దీంతో ఇప్పుడు కేంద్రం ఇవ్వబోయే నిధులు రెండు రాష్ట్రాలకు రూ.50 కోట్ల చొప్పున పంచుతారా? లేక వందేసి కోట్లు ఇస్తారా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడమే ప్రధానంగా మారింది. తమిళ భాషకు దశాబ్దం కిందటే ప్రాచీన హోదా లభించింది. ఈ కాలంలో తమిళ భాష విశేషంగా ప్రాచుర్యం పొందడానికి కేంద్ర నిధులు బాగా దోహదపడ్డాయి. అవార్డులు, పురస్కారాలు, యువ రచయితలకు ప్రోత్సాహకాలు వంటì వాటికి ఆ ప్రభుత్వం వినియోగించింది. కొలంబో, సింగపూర్‌ల్లోనూ శాఖలు ఏర్పాటు చేసుకుంది.
విశాఖ అనుకూలం..
తెలుగు ప్రాచీన భాష క్లాసికల్ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనువైనదని తెలుగు భాషాపండితులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే సాంస్కృతిక రాజధానిగా విశాఖకు పేరుంది. సెంటర్ ఏర్పాటుకు నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సరైనదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏయూలో విశాలమైన పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సెంటర్‌కు అనుకూలమైనవి ఉన్నాయి. అన్నిటికీ మించి 1931లో అప్పటి వీసీ సర్వేపల్లి రాధాకష్ణన్ తెలుగు శాఖను అవిభక్త తెలుగు రాష్ట్రాల్లోకెల్లా తొలిసారిగా ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత తెలుగు ఆచార్యులు తోమాటి దోణప్ప, బూదరాజు రాధాకష్ణ, చేకూరి రామారావు, బద్రిరాజు చక్రవర్తి తదితరులు ఏయూ విద్యార్థులే. వీటన్నిటిని దష్టిలో ఉంచుకుని విశాఖలోనే తెలుగు భాష క్లాసికల్ సెంటర్ ఆవశ్యకతపై వచ్చే నెల 5న విశాఖలో ఓ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కానున్నట్టు తెలిసింది.
విశాఖ అనువైనది..
మద్రాసు హైకోర్టు తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వడం ఎంతో శుభపరిణామం. తెలుగు భాష క్లాసికల్ సెంటర్ ఏర్పాటుకు విశాఖ అనువైనది. ఇప్పటికే విశాఖ సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఈ సెంటర్ కూడా ఏర్పాటయితే తెలుగు భాష మరింత విరాజిల్లుతుంది. ఇందుకవసరమైన స్థలం, భవనాలు ఏయూలో ఖాళీగా ఉన్నాయి. పైగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తొలి తెలుగు శాఖ ఏయూలోనే ఏర్పాటైంది. సత్వరమే కార్యాచరణకు పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలి.
–రామతీర్థ, కవి, రచయిత, అనువాదకులు
తీర్పు కనువిప్పు కావాలి..
మద్రాస్ హైకోర్టు తెలుగు భాషకు ప్రాచీన హోదాకు అడ్డంకులు తొలగించడం సంతోషకరం. ఈ తీర్పు నేపథ్యంలోనైనా ప్రభుత్వ పాఠశాలల్లో విధిగా ఒక సబ్జెక్టులోనైనా తెలుగు బోధన కొనసాగించాలి. అలా అయితేనే వచ్చే వందేళ్ల తర్వాత కూడా అన్ని వర్గాల వారూ తెలుగు మాట్లాడగలుగుతారు. అమెరికాలో తెలుగు కోసం తపిస్తుంటే ఇక్కడ బోధనలో తెలుగునే లేకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులకు కనువిప్పు కలగాలి. తెలుగు క్లాసికల్ సెంటర్ విశాఖలో ఏర్పాటు చేయడం సమంజసం.
–ప్రొ. చందు సుబ్బారావు, రచయిత, విమర్శకుడు
కల నెరవేరింది
తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కాలన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది. కోర్టు తీర్పు ఎంతోకాలంగా చూస్తున్న ఎదురు చూపులకు పన్నీటి జల్లులాంటిది. తెలుగు భాషాభిమానులకు, తెలుగు ప్రజలకు ఎంతో సంతోషాన్నిస్తోంది. సాంస్కృతిక రాజధాని విశాఖలో తెలుగు భాష క్లాసికల్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
–నారాయణరావు, కార్యదర్శి, విశాఖ సాహితీ సంస్థ
Advertisement