తెలుగు సంస్కృతిని కాపాడుకోవడమే లక్ష్యం
-
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ మాజీ అధ్యక్షుడు సురేష్ మండువ
-
నేడు ఆత్మీయ అభినందన పురస్కార ప్రదానం
నెల్లూరు(బారకాసు): అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగు వారికి అండగా నిలబడటమే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ లక్ష్యమని ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు సురేష్ మండువ తెలిపారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడిన సురేష్ నెల్లూరు వచ్చిన సందర్భంగా గురువారం పలు విషయాలను వెల్లడించారు.
నెల్లూరు ఏసీనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వీఆర్సీ కళాశాలలో విద్యనభ్యసించాను. ఆ తరువాత తిరుపతిలో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు చేసి కంప్యూటర్‌సైన్స్ కోర్సు చేసేందుకు 1996లో అమెరికా వెళ్లాను. కోర్సు పూర్తిచేసిన వెంటనే అక్కడే ఉద్యోగం దొరకడంతో స్థిరపడిపోయాను. 2000లో యోగితతో వివాహమైంది. అక్కడే మాకు బాబు, పాప సంతానం కలిగారు. చిన్నప్పట్నుంచి నాకు కళారంగం అంటే ఎంతో ఇష్టం. కళాశాలల్లో జరిగే ఫంక్షన్లలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడ్ని. అమెరికాలో స్థిరపడిన తరువాత తెలుగు వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ వాటికున్న విలువలను కాపాడాలన్న ఉద్దేశంతో నాటా, ఆటా, తానా వంటి సంస్థల్లో సభ్యుడిగా చేరి సేవలందించాను. ఈ క్రమంలోనే 2013లో టీఏఎన్‌టీఈఎక్స్ సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను.
తెలుగు కళాకారులకు అవకాశం
అమెరికాలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కలిగిన తెలుగు కళాకారులకు అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తున్నాం. సినీ రంగానికి చెందిన తనికెళ్లభరిణి, సుద్దాల అశోక్‌తేజ, లక్ష్మీపార్వతి, జొన్నవిత్తులతో పాటు నెల్లూరుకు చెందిన హాస్య కళాకారుడు దోర్నాల హరిబాబు, ప్రముఖ నృత్య కళాకారిణి నదియా, నాశికా వేణుగానం సాయిహేమంత్‌కృష్ణ, తదితరులకు అవకాశం కల్పించాం.
వివిధ రకాల సేవా కార్యక్రమాలు
స్ఫూర్తి, మైత్రి, వనిత–వేదిక, తెలుగు వెన్నెల పేర్లతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. స్ఫూర్తిపేరుతో వృద్ధులకు సేవలందించడం, అమెరికాలో పుట్టిన తెలుగు చిన్నారులకు పాఠాలు నేర్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మైత్రి పేరుతో అమెరికాలో ఉంటున్న కుటుంబ సభ్యుల కోసం వచ్చి వెళ్లే వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. వనిత–వేదిక పేరుతో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. సాహిత్యవేదిక ద్వారా తెలుగు వెన్నెల పేరుతో ప్రతి నెలా మూడో ఆదివారం పలువురు ప్రముఖ కవులను పిలిపించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
నేడు ఆత్మీయ అభినందన పురస్కార ప్రదానం
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగువారికి అండగా నిలుస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్న నెల్లూరీయుడైన సురేష్ మండువకు 25 కళాసంఘాల ఆధ్వర్యంలో హరివిల్లు క్రియేషన్స్ పర్యవేక్షణలో శుక్రవారం ఆత్మీయ అభినందన పురస్కారం ప్రదానం చేయనున్నారు. నగరంలోని పురమందిరంలో సాయంత్రం 6గంటలకు జరిగే కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.