తెలుగు మీడియం రద్దు దారుణం
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజా ధ్వజం
కాకినాడ సిటీ : మున్సిపల్ స్కూల్స్‌లో తెలుగు మీడియం రద్దు చేయడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక కచేరిపేటలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఆర్. ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి.రాజా మాట్లాడుతూ విద్యా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలలో తెలుగు మీడియం రద్దు వల్ల జిల్లాలో 38 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారన్నారు. దేశం అంతా మాతృభాషలోనే విద్య ఉంటే రాష్ట్రంలో మాత్రం తెలుగు మీడియాన్ని రద్దు చేయడంతో విద్యా రంగానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందో అర్ధమవుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 24న జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించకుంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సూరిబాబు, రామ్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.