‘పది’ పేపర్‌ లీకేజీ కలకలం | 'Ten' paper leak uproar | Sakshi
Sakshi News home page

‘పది’ పేపర్‌ లీకేజీ కలకలం

Published Wed, Mar 22 2017 2:33 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

‘పది’ పేపర్‌ లీకేజీ కలకలం

‘పది’ పేపర్‌ లీకేజీ కలకలం

రూరల్‌ జిల్లాలో లీక్‌.. ఖమ్మంలో ప్రత్యక్షం
ఇంగ్లిష్‌–1 ప్రశ్నపత్రం వాట్సప్‌లో హల్‌చల్‌
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఖమ్మం విద్యాశాఖాధికారులు
ప్రాథమిక దర్యాప్తులో వర్ధన్నపేటలో లీకైనట్లు వెల్లడి
పోలీసుల అదుపులో నిందితులు


వరంగల్‌ : పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్ష ప్రశ్నపత్రం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో లీక్‌ అయి ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షం కావడంతో అక్కడ విద్యాశాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంగ్లిష్‌ పేపర్‌–1 పరీక్ష మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత వాట్సప్‌లో ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. అన్ని వాట్సప్‌లలో ప్రశ్నలు కనిపించడంతో జిల్లా వ్యాప్తంగా లీకేజీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న ఖమ్మం విద్యా«శాఖాదికారులు వెంటనే ఎంఈఓలు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లను అప్రమత్తం చేశారు. ప్రశ్నపత్రం లీకైందనే ఫిర్యాదుతో ఖమ్మం జిల్లా పోలీస్‌ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఏసీపీ గణేష్‌ ఆ«ధ్వర్యంలో పోలీసులు డీఈఓ కార్యాలయానికి చేరుకొని విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మీబాయిని ప్రశ్నించారు. ఈమేరకు వరంగల్‌ ఆర్జేడీ బాలయ్యతో సంప్రదింపులు జరిపారు.

ఉదయం 9.30 గంటలకే పరీక్ష ప్రారంభమైందని,  11.30 గంటలకు పరీక్ష పూర్తయి ఉంటుందా? లేక విద్యార్థి పరీక్ష రాసి వస్తే అతడి ప్రశ్నపత్రాన్ని వాట్సప్‌లో పెట్టారా? లేదా నిజంగా లీక్‌ అయిందా? అనే విషయం విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్‌ అయిందంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఖమ్మం డీఈఓ విజయలక్ష్మీబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఓ చానల్‌లో 12.15 గంటలకు ప్రశ్నపత్రం లీక్‌ అయిందని కథనాలు ప్రసారమయ్యాయని, దీని ఆధారంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. వాట్సప్‌లో వచ్చిన పేపర్‌ ఆధారంగా ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులతో చర్చించి.. అసలు వ్యవహారాన్ని రాబట్టారు. చివరకు ప్రశ్నపత్రాన్ని వరంగల్‌ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్‌ వాట్సప్‌లో పెట్టినట్లు వెల్లడైంది.  
 టెక్నాలజీతో గుట్టురట్టు..
 పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌కు వాట్సప్‌ వేదికగా మారింది. ఇదే నూతన విధానం నిందితుడిని సైతం పట్టించేందుకు ఉపయోగపడింది. పోలీసులు విచారణలో ప్రశ్నపత్రం వచ్చిన వాట్సప్‌ ద్వారా కొత్త టెక్నాలజీతో ఎక్కడెక్కడి నుంచి ప్రశ్నపత్రం వచ్చిందో తెలుసుకున్నారు.

పోలీసుల విచారణలో.. వరంగల్‌కు చెందిన ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ ఉదయం 9.40 గంటలకు ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేశాడనే నిర్ధారణకు వచ్చారు. 10.36 గంటలకు ఖమ్మంలోని ఓ చానెల్‌ ప్రతినిధికి ఆ ప్రశ్నపత్రం చేరినట్లు గుర్తించారు. దీని ఆధారంగా చానెల్‌లో 11.30 గంటలకు ప్రసారమైనట్లు గుర్తించారు. పోలీసులు మాత్రం పరీక్ష చివరి క్షణాల్లోనే పరీక్షా పత్రం లీక్‌ అయినట్లు వెల్లడించారు.  

సీఎం దృష్టికి లీకేజీ వ్యవహారం..
ప్రశ్నపత్రం లీకైనట్లు మీడియాలో ప్రసారం కావటంతో సీఎం కేసీఆర్‌ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. గతంలో ఎంసెట్‌–2 పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారం వరంగల్‌లో జరగడంతో ఆయన ప్రశ్నాప్రతం లీకేజీపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

డీఈఓ కార్యాలయం నుంచే విచారణ
పదవ తరగతి ప్రశ్నాప్రతం లీకేజీపై ఖమ్మం జిల్లా పోలీసులు అక్కడి డీఈవో కార్యాలయం నుంచి విచారణ ప్రారంభించారు. ఏసీపీ గణేష్‌ ఆధ్వర్యంలో సీఐలు రాజిరెడ్డి, నాగేంద్రాచారి, ఎస్సై మల్లయ్యలు జిల్లాలో పరీక్షలు జరుగుతున్న తీరు, సిబ్బంది, బందోబస్తుపై ఆరాతీశారు. వాట్సప్‌లో వచ్చిన సందేశం, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టారు. పలుమార్లు మీడియా ప్రతినిధులు, డీఈఓ, ఆర్జేడీలతో చర్చలు జరిపారు. అక్కడి నుంచి సీపీ షానవాజ్‌ ఖాసీం, కలెక్టర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌తో చర్చించారు. అనంతరం ఏసీపీ గణేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. డీఈఓ విజయలక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో దోషులను పట్టుకుంటామన్నారు.

ఆర్జేడీ అత్యవసర సమీక్ష
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అంటూ కథనాలు రావటంతో ఆర్జేడీ బాలయ్య, ఖమ్మం డీఈఓ విజయలక్ష్మీబాయి మంగళవారం మధ్యాహ్నం చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఎంఈఓలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే జైలుశిక్ష తప్పదని, లీకేజీ వ్యవహారంలో కొందరి హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతుందని,  దీనిపై పోలీసుల విచారణ జరుగుతుందని, దోషులుగా తేలితే శిక్ష తప్పదన్నారు. ప్రతి విద్యార్థి ప్రశ్నపత్రంపై హాల్‌టికెట్‌ నంబర్‌ విధిగా వేసేలా చూడాలన్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత మాత్రమే విద్యార్థులను బయటకు పంపించాలని సూచించారు. ప్రశ్నపత్రాలను భారీ బందోబస్తు, ఎస్కార్ట్‌ సహాయంతో తరలించాలన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement