ఎస్సీ సబ్‌ప్లాన్ టెండర్లకు బ్రేక్
-
ఆనం సోదరుల ఎత్తుగడకు అజీజ్ పై ఎత్తు
-
టెండర్లు రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు
నెల్లూరు, సిటీ:
టీడీపీలో ఆధిపత్యపోరు కారణంగా నెల్లూరు కార్పొరేషన్‌లో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. నగర మేయర్ అజీజ్, ఆనం సోదరుల మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దళితవాడల్లో అభివృద్ధి పనులకు విడుదలైన ఎస్సీ సబ్‌ప్లాన్ ని«ధులతో జరగాల్సిన పనులకు మరోసారి బ్రేక్ పడినట్లయింది. ఇటీవల సబ్‌ప్లాన్ నిధులు రూ.42కోట్లతో 8 ప్యాకేజీలు చేసి అధికారులు టెండర్లను పిలిచారు. వీటిని దక్కించుకుని అజీజ్‌కు చెక్ పెట్టేందుకు ఆనం సోదరులు రంగంలోకి దిగారు. ఈ టెండర్లను ఆనం సోదరులు వారి మద్దతుదారుల ద్వారా దాఖలు చేయించారు. ఈ విషయాన్ని సాక్షి పత్రిక శనివారం 'ఆదాల, అజీజ్‌కు ఆనం చెక్' అనే శీర్షికతో కథనం ప్రచురించింది. దీంతో మేయర్ అజీజ్ సబ్‌ప్లాన్ నిధుల టెండర్ల పై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. ఆనం సోదరులు కార్పొరేషన్‌పై పట్టుకోసం వారి మద్దతుదారులైన కాంట్రాక్టర్ల ద్వారా టెండర్లు వేయించిన విషయం నిజమేనని తేలింది. దీంతో మేయర్ అజీజ్ టెండర్లు రద్దు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన టెండర్ల దాఖలు గడువు ముగినుంది. ఈ క్రమంలో టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచే యోచనలో మేయర్ ఉన్నట్లు సమాచారం.
పట్టు కోసం ఆనం, అజీజ్ పాకులాట
టీడీపీలో ఆనం సోదరులు తమ పట్టుకోసం అందిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి ఆనం వివేకాను వ్యతిరేకిస్తున్న మేయర్ అజీజ్ టీడీపీలో ఆనం సోదరులు చేరికను జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆనం వివేకాందరెడ్డి సైతం కార్పొరేషన్‌లో తన ముద్ర ఉండే విధంగా కొంత కాలంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో పిలిచిన టెండర్లను ఆనం సోదరులు తమ వర్గ కాంట్రాక్టర్ల ద్వారా దాఖలు చేయించారు. ఇదే క్రమంలో మేయర్ అజీజ్ సైతం మరో అడుగు ముందుకేసి టెండర్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులకు టెండర్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నేడో, రేపో టెండర్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు.
అన్ని కార్పొరేషన్లలో పనులు ప్రారంభించినా..
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరై దాదాపు 10 నెలలు గుడుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో సబ్‌ప్లాన్ నిధులతో పనులు పూర్తిచేశారు. నెల్లూరు కార్పొరేషన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. టీడీపీ నాయకులు ఆధిపత్యపోరు, సొంత లాభార్జన కోసం ఇంత కాలం టెండర్లు పిలవకుండా ఆలస్యం చేశారు. వైఎస్సార్‌సీపీ నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఇద్దరూ కార్పొరేషన్ వద్ద ధర్నాకు దిగడంతో ఎట్టకేలకు టెండర్లు పిలిచారు.టెండర్లు పిలిచి రోజులు గడవక ముందే టీడీపీలో ఆధిపత్యపోరు కారణంగా రద్దు చేయడంతో నగరంలో అభివృద్ధి కుంటుపడుతుందని విశ్లేషకులు అంటున్నారు..