జిల్లా... ప్రకృతి సౌందర్యానికి ఖిల్లా
జిల్లా... ప్రకృతి సౌందర్యానికి ఖిల్లా
Published Sat, Feb 11 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
పచ్చటి పంట పొలాలతో ఆహ్లాదం పంచుతోంది
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్
భానుగుడి (కాకినాడ): పచ్చటి పంట పొలాలు... గోదావరి నది అందాలు... ప్రకృతి సోయగాలతో తూర్పుగోదావరి జిల్లా ఆహ్లాదం పంచుతోందని అంతర్జాతీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. శనివారం నిర్వహించిన గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయిన నైనా నగరంలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఆ పాఠశాల చైర్మన్, కరస్పాండెంట్ గ్రంధి బాబ్జీతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. సాహిత్యానికి, కళలకు కాణాచిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కాకినాడ నగరానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అతి చిన్న వయస్సులో జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి, ప్రపంచ స్థాయిలో టేబుల్ టెన్నిస్‌లో రాణించడం వెనుక తన తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఓ గ్రామీణ ప్రాంతంలో చక్కని పాఠశాలను స్థాపించిన గ్రంధి బాబ్జీని ఆమె అభినందించారు. ప్రపంచీకరణలో భాగంగా పెచ్చుమీరుతున్న వింత పోకడల వల్ల విద్యావ్యవస్థ, యువత తీవ్రంగా నష్టపోతుందని ఆమె ఆవేదన చెందారు. విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను సందర్శిస్తున్నట్టు ఆమె తెలిపారు. జిల్లా జర్నలిస్ట్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల క్రీడా పోటీల ట్రోఫీని ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత సబ్బెళ్ళ శివన్నారాయణ రెడ్డి తాను రచించిన గోదావరి, అమరావతి పుస్తకాలను నైనాకు బహూకరించారు. కార్యక్రమంలో గ్రీన్‌ఫీల్డ్ పాఠశాల మేనేజ్‌మెంట్ సభ్యులు రంజిత్, కోకనాడ ప్రెస్‌క్లబ్ అసోసియేషన్ నాయకులు వర్మ, నవీన్‌రాజ్, ఏలియా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement