athlet
-
అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న వైజాగ్ అమ్మాయి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కూతురే జ్యోతి యర్రాజి. జాతీయ అథ్లెట్ జట్టుకు ఎంపిక అవ్వాలన్న లక్ష్యంతో ఆరేళ్ల వయసు నుంచి ఎంతో కృషి చేసింది. జాతీయ అథ్లెట్ క్యాంప్‌కు అర్హత సాధించింది. అనుకోకుండా గాయం బారిన పడటం, తదనంతరం కరోనాతో శిక్షణ శిబిరం నడవకపోవడంతో కాస్త విరామం వచ్చింది. ఇటీవలే మీట్లు నిర్వహిస్తుండటంతో చురుగ్గా తనకిష్టమైన హార్డిల్స్లోనే సత్తాచాటేందుకు సిద్ధమైంది. వరల్డ్ 100 మీటర్ల హార్డిల్స్‌లో 347వ ర్యాంక్‌లో, వుమెన్ ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో 3,487వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. కెరీర్లో ఉత్తమ ప్రదర్శన 100 మీటర్ల హర్డిల్స్ తన బెస్ట్ ఛాయిస్ అంటున్న జ్యోతి 100, 200 మీటర్ల పరుగులోనూ జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శన చేస్తోంది. 100 మీటర్ల పరుగును 11.61 సెకన్లలోనే పూర్తి చేయగా, 200 మీటర్ల పరుగును 24.35 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో బెస్ట్ సాధించింది. ఇక 100 మీటర్ల హర్డిల్స్‌ను కొయంబత్తూర్‌లో 14.92 సెకన్లలోనూ పూర్తి చేసింది. మూడ్బిద్రిలో జరిగిన మీట్లో మంచి ప్రతిభ సాధించింది. గత నెలలో జరిగిన నేషనల్ మీట్లో మూడు అంశాల్లో పాల్గొని జ్యోతి చక్కటి ప్రతిభ కనబరిచింది. 100 మీటర్ల పరుగును 13.43 సెకన్లలో, 200 మీటర్ల పరుగును 24.35 సెకన్లలో పూర్తి చేసిన జ్యోతి ఇదే వేదికపై 13.09 సెకన్లలోనే 100 మీటర్ల హార్డిల్స్‌ను పూర్తి చేసింది. రికార్డే.! నమోదు కాలేదు ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా అంతర వర్సిటీల అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి రికార్డు వేగంతో పూర్తి చేసి స్వర్ణాన్ని అందుకుంది. జ్యోతి 13.09 సెకన్లలోనే 100 మీటర్ల హార్డిల్స్‌ను పూర్తి చేసింది. జాతీయ రికార్డు 13.38 సెకన్లగానే ఉంది. అయితే ఈ మీట్లో విండ్ వేగం 2.1గా ఉండటం, ఈ మీట్లో నాడా టెక్నికల్ డెలిగేట్ లేకపోవడంతో చక్కటి అవకాశాన్ని కోల్పోయింది. -
శతాధిక అథ్లెట్, చండీగఢ్ అద్భుతం కన్నుమూత
చండీగఢ్: భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ శతాధితక అథ్లెట్, చండీగఢ్ అద్భుతం సర్దార్ని మన్ కౌర్ (105) ఇక లేరు. గాల్ బ్లాడర్ కాన్సర్‌తో బాధపడుతూ పంజాబ్ మొహాలీలోని శుద్ధి ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు గురుదేవ్ సింగ్ ధృవీకరించారు. వయసు ఒక నంబరు మాత్రమే అని నిరూపించిన అద్భుత క్రీడాకారిణి మరణంపై పలువురు క్రీడాకారులు సంతాపం ప్రకటించారు. 2017లో ఆక్లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచిన సెంటెనేరియన్ స్ప్రింటర్ మన్ కౌర్ 1916, మార్చి 1న జన్మించారు. వాస్తవానికి మన్ కౌర్ 93 సంవత్సరాల వరకు అథ్లెటిక్స్ మొదలు పెట్టలేదు. 2016 లో అమెరికన్ మాస్టర్స్ గేమ్ పోటీల్లో అత్యంత వేగంగా పరుగెత్తే సెంటెరియన్గా నిలిచారు. 100 ఏళ్లు పైబడిన విభాగాల్లో ఆమె ప్రపంచ రికార్డులను సొంతం చేసు కున్నారు. ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అనేక బంగారు పతకాలుగెలుచుకున్నారు. 2019లో పోలాండ్‌లో షాట్ పుట్, 60 మీ స్ప్రింట్, 200 మీటర్లు, జావెలిన్ త్రో నాలుగు ఈవెంట్లను కౌర్ గెలుచుకోవడం విశేషం. స్వయంగా కౌర్ కుమారుడు గురుదేవ్ సింగ్ ఆమెకు కోచ్‌గా వ్యవహరించడం గమనార్హం. మన్ కౌర్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 104 సంవత్సరాల వయస్సులో 2020 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి పురస్కార్ అవార్డుతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. -
Valentina Petrillo: అతడే ఆమె
ఆమె ట్రాన్స్‌జెండర్ మహిళ. దివ్యాంగురాలు.. చిన్నతనంలోనే చూపు కోల్పోయారు. ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు. ట్రాన్స్ పారాలింపిక్ అథ్లెట్ కావాలన్న తన కోర్కెను భార్యకు చెప్పారు. విమర్శకులు మాత్రం ఆమె ఈ పోటీలో పాల్గొనటం అనైతికం అంటున్నారు. 2019లో పూర్తిగా ట్రాన్స్ ఉమన్‌గా మారక ముందు పురుషులతో పోటీపడ్డారు వాలెంటినా. వాలెంటీనా ఇటలీ దేశస్థురాలు. వాలెంటినాకు చిన్నతనం నుంచి పరుగు పోటీలంటే చాలా ఇష్టం. కాని వాలెంటినాకు 14 వ ఏట స్టార్గార్డ్ట్ వ్యాధి వచ్చినట్టు గుర్తించారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. క్రమేపీ చూపు పూర్తిగా మందగిస్తుంది. తన స్వస్థలం నేపుల్స్లో స్కూల్ చదువు పూర్తయ్యాక, అంధుల కోసం ప్రత్యేకంగా ఉన్న ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ చదవటం కోసం బోలోనా చేరుకున్నారు. అప్పటికి వాలెంటినా వయసు 20 సంవత్సరాలు. అక్కడ ఆటలు ఆడటం ప్రారంభించారు. ఇటలీ జాతీయ అంధుల ఫుట్‌బాల్ టీమ్‌లో సభ్యులయ్యారు. ఆ తరవాత మళ్లీ 41 సంవత్సరాల వయసులో వాలెంటినా రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనటం ప్రారంభించి, కేవలం మూడు సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో మొత్తం 11 అవార్డులు సాధించారు. అది కూడా పురుషుల టి – 12 విభాగంలో పాల్గొని సాధించారు. ఇప్పుడు వాలెంటినా వయసు 47 సంవత్సరాలు. పొడవు 5 అడుగుల 10 అంగుళాలు. పారాలింపిక్స్‌లో పాల్గొనడానికి ఇదే ఆఖరి అవకాశం. టోక్యోలో పాల్గొనే అవకాశం వస్తుందో రాదో తెలియనప్పటికీ వాలెంటినా ప్రతిరోజూ పరుగు పోటీ కోసం సాధన చేస్తూనే ఉన్నారు. వాలెంటినాకు తొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడు తన తల్లి ధరించే స్కర్ట్ ధరించారు. ‘‘ఆ రోజు నాలో ఏదో తెలియని భావోద్వేగం కలిగింది. మన చేతులతో స్వర్గపుటంచులు తాకిన భావన కలిగింది’’ అంటున్న వాలెంటినా ఆ విషయాన్ని ఎవ్వరితోనూ పంచుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తనకు ఒక ట్రాన్స్‌జెండర్ కజిన్ ఉంది. ఆమె విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. ఎవరితోనైనా తన విషయం చెబితే, తన జీవితం కూడా అలాగే అవుతుందనే ఉద్దేశంతో వాలెంటినా పురుష వస్త్రధారణలోనే జీవితం గడిపారు. భార్య అంగీకారంతో.. దశాబ్దాల కాలంగా పురుష వేషధారణలో ఉన్న వాలెంటినా ఎలాగైనా తన గురించి భార్యకు వివరించాలనుకున్నారు. అప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు. చదువులో మంచి ర్యాంకులు సాధించారు, మంచి ఉద్యోగం, మంచి భార్య, ఇద్దరు పిల్లలు. కాని ఏదో తెలియని అసంతృప్తి. ఇక తనలోని స్త్రీ గుణాలను దాచుకోలేక, జూలై 17, 2017న భార్యకు విషయం చెప్పారు వాలెంటినా. ఆమె ముందు అవాక్కయ్యింది. కాని తరవాత అర్థం చేసుకోవటంతో, ఆమె సహకారంతో 2018 నుంచి వాలెంటినా మహిళగా జీవించటం ప్రారంభించారు. 2019 జనవరిలో హార్మోన్ థెరపీ తీసుకున్నారు. అందువల్ల శరీరం, మనసు కూడా మార్పు చెందాయి. ‘‘నా మెటబాలిజమ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. నేను ఇంతకు ముందులా బలంగా లేను. ఇంతకు ముందు తిన్నట్లు తినలేకపోతున్నాను. రక్తహీనత వచ్చింది. హెమోగ్లోబిన్ తగ్గిపోయింది. నిరంతరం జలుబు చేస్తోంది. అంతకు ముందులా నిద్రపోలేకపోతున్నాను. నా మూడ్స్ కూడా తరచుగా మారిపోతున్నాయి’’ అంటున్న వాలెంటినా, ఒక స్పోర్ట్స్ పర్సన్‌గా ఓటమిని కూడా అంగీకరించాలంటారు. తన వ్యక్తిగత ఆనందం కోసం మహిళగా మారిన వాలెంటినాకు ఇప్పుడు శారీరక శక్తి బాగా తగ్గిపోయింది. టోక్యో కోసం.. ఏడాది క్రితం జరిగిన ఇటాలియన్ పారాలింపిక్స్ అథ్లెటిక్ పోటీలలో మొట్టమొదటి మహిళా పారాలింపిక్ అథ్లెట్‌గా బహుమతులు అందుకున్న తరవాత, వాలెంటినాకు ఇటలీ తరఫున పారాలింపిక్ గా టోక్యోలో పాల్గొనాలనే కోరిక కలిగింది. ‘‘ఒక మహిళగా పరుగు పందెంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. నాలో ఏదో ఒక తెలియని ఫైర్ ఉంది. అదే నన్ను ముందుకు తోస్తోంది. ఏదో తెలియని భావోద్వేగం కూడా ఉంది. అయితే 20 సంవత్సరాల వయసులో ఉన్న శక్తి లేదు నాలో. కాని నాలోని సంతోషమే నా హద్దులు దాటమని నన్ను ముందుకు తోస్తోంది’’ అంటారు వాలెంటినా. అందరితోనూ గొడవలు.. 1970 ప్రాంతంలో నేపుల్స్లో ఉన్న రోజుల్లో వాలెంటినా ప్రతిరోజూ వీధిలో ఎవరో ఒకరితో గొడవ పెట్టుకునేవారు. ‘‘నేను చేసే గొడవలకు మా అన్నయ్య ఎప్పటికప్పుడు నన్ను రక్షిస్తూ ఉండేవాడు. అన్నయ్య నా కంటె మూడు సంవత్సరాలు పెద్ద’’ అంటున్న వాలెంటినా... నలుగురిలో ఉన్నప్పుడు మహిళల గురించి చాలా అసభ్యంగా మాట్లాడేవారు. కాని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మహిళగా జీవించేవారు. ఎన్నో సవాళ్లు... ఇటీవలి కాలం వరకు వాలెంటినా పారాలింపిక్ టి 12 విభాగంలో పాల్గొన్నారు. ఇందులో టి అంటే ట్రాక్ అని, 12 అంటే అంధులకు సంబంధించిన మూడు గ్రూపులలో ఒక గ్రూపు. తన జీవితంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు వాలెంటినా. వ్యక్తిగత జీవితం, క్రీడా జీవితం, వైవాహిక జీవితం... అన్ని రకాలుగా సవాళ్లను అధిగమించారు. ఆమె జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ తీయటానికి ఫిల్మ్ – 5 నానేమోల్స్ కి అంగీకారం తెలిపారు. ‘‘నా జీవితం మీద సినిమా వస్తుందని నేను ఊహించలేదు. నాలాంటి వారికి నా జీవితం ఒక సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటారు వాలెంటినా పెట్రిలో. -
కాంస్యం ఖాయం చేసుకున్న జరీన్
టర్కీ: ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న బాస్ఫోరస్ మహిళల బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్, హైదరాబాద్ అమ్మాయి కాంస్య పంతకం ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగంలో జరీన్.. కజకిస్థాన్‌కు చెందిన నాజీమ్ కైజేబ్‌ను మట్టికరిపించింది. జరీన్ 4-1 తేడాతో కైజేబ్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. దాంతో కనీసం కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. 2014, 2016 వరల్డ్‌చాంపియన్ షిప్లో రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన కైజేబ్‌ను ఓడించడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది. జరీన్ తర్వాత గౌరవ్ సోలంకీ 57 కేజీల విభాగంలో ప్యూజిలిస్ట్ ఐకోల్ మిజాన్‌ను గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. దాంతో సోలంకీ కూడా కాంస్యాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే, సోనియా లూథర్ (57కేజీలు), పర్విన్ (60కేజీల), జ్యోతి(60కేజీల) విభాగాలలో క్వార్టర్‌లోనే వెనుదిరిగారు. అయితే శివథాప(63 కేజీలు) టర్కీకి చెందిన హకన్డొగన్ చేతిలో ఓడిపోయాడు. అయితే జరీన్ తన తుది పోరులో టర్కీకి చెందిన రజత పతక విజేత బుసేనాజ్ కాకిరోగ్లూ ఎదుర్కొవాల్సి ఉంది. ఇక సోలంకీ అర్జెంటినాకు చెందిన నిర్కో క్యూలోతో తలపడతాడు. చదవండి:రితికా ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా? -
ఆఖరి రౌండ్
పరుగు పందెంలో ఆఖరి రౌండ్‌కి వచ్చేశారు రష్మి.. ఫలితం ఏమైందన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మి రాకెట్’. ఇందులో రష్మి అనే రన్నర్ పాత్రలో తాప్సీ కనిపిస్తారు. ఆఖర్ష్ ఖురానా దర్శకుడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ గుజరాత్లో ప్రారంభం అయింది. ఫిబ్రవరి వరకూ సాగే ఈ షెడ్యూల్‌తో ‘రష్మి రాకెట్’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో అథ్లెట్‌గా కనిపించడం కోసం శరీరాకృతిని మొత్తం మార్చుకున్నారు తాప్సీ. కఠినమైన వ్యాయామాలు చేశారు. స్ట్రిక్ట్ డైట్ పాటించారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
అరవైలలో...ఆరోగ్యమే ఒక పతకం
జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వాళ్లకు వయసు అడ్డంకి కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మినవాళ్లు.. ఆరు పదులు దాటిన వయసులోనూ ‘సెంచరీలు కొట్టే వయస్సు మాది..’ అంటూ దూసుకెళ్తుంటారు. అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా ఇష్టమైన రంగాల్లో రాణిస్తుంటారు. ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారిలో గుంటూరులో నివాసం ఉంటున్న 67 ఏళ్ల పెంట్యాల సుబ్బాయమ్మ మొదటి వరుసలో ఉంటారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో షార్ట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్, స్విమ్మింగ్, పరుగు పోటీల్లో సత్తా చాటుతూ వెటరన్ అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆరోగ్యమే ఒక పతకం అంటున్నారు. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన సుబ్బాయమ్మకు అదే జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులకు చెందిన పెంట్యాల జైహింద్ గురూజీతో వివాహమైంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బాయమ్మ భర్త వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు కూడా నిర్వహించేవారు. పిల్లలు ప్రయోజకులై, పెళ్లిళ్లు చేసుకుని ఉద్యోగాల్లో ఉండటంతో 2006లో ద్రోణాదుల నుంచి సుబ్బాయమ్మ, జైహింద్‌లు గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. స్వగ్రామంలో యోగా శిక్షణ ఇస్తుండే సుబ్బాయమ్మ.. గుంటూరుకు వచ్చాక రోజూ ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లేవారు. 2008లో లాఫింగ్ క్లబ్లో చేరారు. క్లబ్ నిర్వాహకులు ఆమె ఉత్సాహం గమనించి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించారు. దీంతో ఈమె వెటరన్ అథ్లెట్‌గా రూపాంతరం చెందారు. షార్ట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్, స్విమ్మింగ్, పరుగు విభాగాల్లో సుబ్బాయమ్మ మైదానంలో దిగారంటే పతకం సాధించకుండా వెనుతిరగరు అనే పేరుంది. సుబ్బాయమ్మను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడంతో పాటు తాను కూడా వెటరన్ అథ్లెట్‌గా రాణిస్తున్నారు ఆమె భర్త 77 ఏళ్ల జైహింద్. నడక, పరుగు విభాగాల్లో భార్యతోపాటు వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. నిత్య సాధన సుబ్బాయమ్మ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి గంటన్నర పాటు యోగా, వ్యాయామం చేసి రన్నింగ్, వాకింగ్ ప్రాక్టీస్ చేస్తారు. మొలకెత్తిన గింజలు, పండ్లు, డ్రైప్రూట్స్, చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటారు. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఎక్కువ ఉప్పు, నూనెలు ఆమె తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండవు. ఆరోగ్యం కోసం దంపతులిద్దరూ నేటికీ ప్రతిరోజు 3 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే ఇద్దరూ సేంద్రియ వంటకాలను గుంటూరు నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నాలుగు ఎకరాల సొంత పొలంలో కొంత కౌలుకు ఇచ్చి కొంత భాగంలో తేనెటీగలు పెంచుతూ స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న ఈ దంపతులు తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేయడమే కాదు... అందరూ ఆరోగ్యంగా ఉండేందుకూ కృషి చేయడం అభినందనీయం. విజేత సుబ్బాయమ్మ 2012 : బెంగుళూరు–జాతీయ స్థాయి 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ స్థానం. 2013 : బాపట్ల–రాష్ట్ర స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ స్థానం. 2014 : నెల్లూరు–100, 200, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం. 2015 : గుంటూరు–35 వ మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్‌లో డిస్కస్‌త్రో, 400 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానం, జావెలిన్ త్రో, 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం. 2016 : మధ్యప్రదేశ్–జాతీయ స్థాయి పోటీల్లో డిస్కస్ త్రో, జావెలిన్,100 మీటర్ల పరుగులో బంగారు పతకం. 2017 : బెంగళూరు–జాతీయ స్థాయి పరుగు పందెం పోటీలో బంగారు పతకం. 2018 : హైదరాబాద్–జాతీయ స్థాయి ఈత పోటీల్లో సుబ్బాయమ్మ మూడు విభాగాల్లో పతకాలు. 2020: కేరళ–జాతీయ స్థాయి పోటీల్లో డిస్కస్‌త్రో, జావెలిన్‌లో ప్రథమ బహుమతి. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మా క్రీడాస్ఫూర్తిని సమాజంలో నలుగురికి పంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడం మా లక్ష్యం. రాష్ట్రం సహా, దేశ వ్యాప్తంగా ఎక్కడ క్రీడల పోటీలున్నా నేను, నా భర్త వెళ్లి పాల్గొంటాం. ఉత్సాహం ఉన్న మా వయసు వారిని మాతో కలుపుకుని, ప్రాక్టీస్ చేయడంతో పాటు, వారిని కూడా పోటీలకు తీసుకువెళుతుంటాం. ఎవరమైనా మితాహారం, నిత్యం వ్యాయామం చేయడం వల్లే ఆరోగ్యంగా ఉంటాం. – సుబ్బాయమ్మ, వెటరన్ క్రీడాకారిణి – వడ్డే బాలశేఖర్. ‘సాక్షి’, గుంటూరు ఫోటోలు : గజ్జల రామ్‌గోపాల్‌రెడ్డి -
కరోనాతో మాజీ అథ్లెట్ మృతి
రోమ్ : ఇటలీకి చెందిన మాజీ అథ్లెట్ డొనాటో సాబియా(56) కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు. 800 మీటర్ల రేస్‌లో రెండు సార్లు ఒలింపిక్ ఫైనల్స్‌కు చేరిన డొనాటో కొవిడ్-19 కారణంగా బుధవారం కన్నుమూసినట్లు ఇటాలియన్ ఒలింపిక్ కమిటీ (సీవోఎన్ఐ) ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న డొనాటో.. పరిస్థితి విషమించి మృతిచెందినట్లు అందులో పేర్కొంది. 1984 లాస్ఎంజెల్స్ ఒలింపిక్స్ 800 మీటర్ల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన సాబియా.. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఏడో స్థానం దక్కించుకున్నాడు. యూరోపియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన డొనాటో మృతి పట్ల సీవోఎన్ఐ సంతాపం తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 83వేలకు పైగా ఉంది. -
మరో విభిన్న పాత్రలో.. ఆది పినిశెట్టి
వైవిధ్యమైన కథలు, పాత్రలతో మెప్పిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ నటుడు ఆది పినిశెట్టి. ఈయన తర్వలోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్నారు. ఆది పినిశెట్టితో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని దర్శకుడు ప్రిత్వి ఆదిత్య అన్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఓ యువకుడు అథ్లెట్‌గా మారే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. వాటిని ఎలా అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకున్నాడనేదే ప్రధాన కథాంశం. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్) సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
మన 'బంగారం' గోమతి
టీ.నగర్: ఆసియన్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన తిరుచ్చి గోమతి మారిముత్తుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దోహాలో జరుగుతున్న ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2019 పోటీలో 800 మీటర్ల పరుగుపందెంలో 2.02.70 సెకన్లలో చేరి బంగారు పతకాన్ని సాధించారు. పేదకుటుంబంలో జన్మించిన గోమతి మారిముత్తు సొంత ఊరు తిరుచ్చి సమీపానగల ముడికండం గ్రామం. తండ్రి మారిముత్తు, తల్లి రాజాత్తి వ్యవసాయ కూలిలు. వారి చివరి సంతానం గోమతి. చిన్ననాటి నుంచే తన కుమార్తెలు చదువు, ఆటల్లో రాణించాలన్నదే తండ్రి మారిముత్తు తపన. గోమతి కృషి ఫలించింది చిన్ననాటి నుంచి చేసిన కృషి ఫలించిందని గోమతి తల్లి రాజాత్తి బుధవారం సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి గోమతికి ఏదైనా సాధించాలన్న తపనతోనే ఉండేదని, ఈ కారణంగా ప్రస్తుతం ఆసియా స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిందన్నారు. ఇది తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుదంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం గోమతి మారిముత్తును అభినందించారు. -
తండ్రితో గొడవ.. యువ క్రీడాకారుడి ఆత్మహత్య
న్యూఢిల్లీ: తండ్రితో గొడవ పడి మనస్థాపానికి గురైన ఓ యువ క్రీడాకారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియం, అథ్లెటిక్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ స్ప్రింటర్ పర్విందర్ చౌదరీ (18) బుధవారం వసతి రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఫోన్ సంభాషణలో తన తండ్రితో గొడవపడ్డాడని, అనంతరం అతని సోదరి మాట్లాడిందని, కానీ దురదృష్టవశాత్తు పర్విందర్ ప్రాణాలు రక్షించలేకపోయామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. -
నిరుపేద గూటిలో పరుగుల ధీరుడు
కర్ణాటక, చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె తాలూకాలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈ.నాగరాజ్ అనే యువకుడు పేద కుటుంబంలో జన్మించినా ఆటల్లో మేటి. పరుగు పందెంలో రాణించి తాలూకాకు, జిల్లాకు, రాష్ట్రానికే పేరుప్రతిష్టలు సంపాదించాడు. నాగరాజ్ కుటుంబానికి చిన్న పూరి గుడిసే ఆధారం. చిన్న వయస్సు నుంచి పేదరికాన్ని అధిగమించి క్రీడా రంగంలో ఆసక్తి పెంచుకున్నాడు. నేపాల్‌లో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని అందుకుని గ్రామీణ ప్రాంత యువతలో ఉత్సాహాన్ని నింపాడు. అతడు ఇప్పుడు నేపాల్‌లో ఆటలపోటీల్లో ఉన్నాడు. చినిగిన చెప్పులతో ఎయిర్‌పోర్టుకు నేపాల్‌కు వెళ్లడానికి చిత్రదుర్గం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చినిగి పోయిన చెప్పులతోనే నాగరాజు వెళ్లాడు. దీనిని గమనించిన తమ గ్రామానికి చెందిన న్యాయవాది అశోక్ నాగరాజ్‌కు షూ ఇప్పించాడు. గతనెల 26న నేపాల్ వెళ్లి రావడానికి స్నేహితులు, ఇతరులు రూ.2 వేలు ధనసహాయం చేశారు. అక్కడ గత నెల 29వ తేదీన జరిగిన అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో 24 దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సాధించాడు. పేద విద్యార్థి సాధనను తెలుసుకున్న నేపాల్ సైన్యం కూడా అభినందనలు తెలిపింది. చిత్రదుర్గ ప్రభుత్వం కళాశాలలో బీఏ చదువుకున్న నాగరాజు బీసీఎం హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుతున్నాడు. చదువుకుంటూ కూలి పని తాలూకాలోని ఓబళాపుర గ్రామ పంచాయితీలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈరణ్ణ, చంద్రమ్మ దంపతుల కుమారుడు నాగరాజ్. గతంలో గోవాలో జరిగిన రాష్ట్రస్థాయి నాలుగవ అఖిల భారత చాంపియన్ షిప్లో పాల్గొని 10 వేల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో బంగారు పతకం కొట్టేశాడు. నాగరాజ్ తన చదువులు, ఖర్చుల కోసం తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడక, శని, ఆదివారాలలో కళ్యాణ మంటపాల్లో జరిగే వేడుకల్లో భోజనాలు వడ్డించే పని చేస్తాడు. ఆ డబ్బులో కొంత తల్లిదండ్రులకూ పంపుతాడు. మంగళవారం నేపాల్ నుంచి బెంగళూరులో దిగి, అటు నుంచి చెళ్లకెరెకు వస్తున్న నాగరాజ్‌కు స్థానిక ఎమ్మెల్యే టి.రఘుమూర్తి స్వాగతం పలికి సన్మానిస్తానని తెలిపారు. -
జిల్లా... ప్రకృతి సౌందర్యానికి ఖిల్లా
పచ్చటి పంట పొలాలతో ఆహ్లాదం పంచుతోంది అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ భానుగుడి (కాకినాడ): పచ్చటి పంట పొలాలు... గోదావరి నది అందాలు... ప్రకృతి సోయగాలతో తూర్పుగోదావరి జిల్లా ఆహ్లాదం పంచుతోందని అంతర్జాతీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. శనివారం నిర్వహించిన గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయిన నైనా నగరంలోని ఓ హోటల్లో బస చేశారు. ఆ పాఠశాల చైర్మన్, కరస్పాండెంట్ గ్రంధి బాబ్జీతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. సాహిత్యానికి, కళలకు కాణాచిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కాకినాడ నగరానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అతి చిన్న వయస్సులో జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి, ప్రపంచ స్థాయిలో టేబుల్ టెన్నిస్‌లో రాణించడం వెనుక తన తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఓ గ్రామీణ ప్రాంతంలో చక్కని పాఠశాలను స్థాపించిన గ్రంధి బాబ్జీని ఆమె అభినందించారు. ప్రపంచీకరణలో భాగంగా పెచ్చుమీరుతున్న వింత పోకడల వల్ల విద్యావ్యవస్థ, యువత తీవ్రంగా నష్టపోతుందని ఆమె ఆవేదన చెందారు. విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను సందర్శిస్తున్నట్టు ఆమె తెలిపారు. జిల్లా జర్నలిస్ట్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల క్రీడా పోటీల ట్రోఫీని ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత సబ్బెళ్ళ శివన్నారాయణ రెడ్డి తాను రచించిన గోదావరి, అమరావతి పుస్తకాలను నైనాకు బహూకరించారు. కార్యక్రమంలో గ్రీన్‌ఫీల్డ్ పాఠశాల మేనేజ్మెంట్ సభ్యులు రంజిత్, కోకనాడ ప్రెస్‌క్లబ్ అసోసియేషన్ నాయకులు వర్మ, నవీన్‌రాజ్, ఏలియా తదితరులు పాల్గొన్నారు.