చండీగఢ్: భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ శతాధితక అథ్లెట్, చండీగఢ్ అద్భుతం సర్దార్ని మన్ కౌర్ (105) ఇక లేరు. గాల్ బ్లాడర్ కాన్సర్‌తో బాధపడుతూ పంజాబ్ మొహాలీలోని శుద్ధి ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు గురుదేవ్ సింగ్ ధృవీకరించారు. వయసు ఒక నంబరు మాత్రమే అని నిరూపించిన అద్భుత క్రీడాకారిణి మరణంపై పలువురు క్రీడాకారులు సంతాపం ప్రకటించారు.
2017లో ఆక్లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచిన సెంటెనేరియన్ స్ప్రింటర్ మన్ కౌర్ 1916, మార్చి 1న జన్మించారు. వాస్తవానికి మన్ కౌర్ 93 సంవత్సరాల వరకు అథ్లెటిక్స్ మొదలు పెట్టలేదు. 2016 లో అమెరికన్ మాస్టర్స్ గేమ్ పోటీల్లో అత్యంత వేగంగా పరుగెత్తే సెంటెరియన్‌గా నిలిచారు. 100 ఏళ్లు పైబడిన విభాగాల్లో ఆమె ప్రపంచ రికార్డులను సొంతం చేసు కున్నారు. ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అనేక బంగారు పతకాలుగెలుచుకున్నారు.
2019లో పోలాండ్‌లో షాట్ పుట్, 60 మీ స్ప్రింట్, 200 మీటర్లు, జావెలిన్ త్రో నాలుగు ఈవెంట్‌లను కౌర్ గెలుచుకోవడం విశేషం. స్వయంగా కౌర్ కుమారుడు గురుదేవ్ సింగ్ ఆమెకు కోచ్‌గా వ్యవహరించడం గమనార్హం. మన్ కౌర్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 104 సంవత్సరాల వయస్సులో 2020 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి పురస్కార్ అవార్డుతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment