సాధించిన పతకాలతో నాగరాజ్ (ఫైల్), నాగరాజ్ కుటుంబం నివసిస్తున్న పూరి గుడిసె ఇదే
కర్ణాటక, చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె తాలూకాలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈ.నాగరాజ్ అనే యువకుడు పేద కుటుంబంలో జన్మించినా ఆటల్లో మేటి. పరుగు పందెంలో రాణించి తాలూకాకు, జిల్లాకు, రాష్ట్రానికే పేరుప్రతిష్టలు సంపాదించాడు. నాగరాజ్ కుటుంబానికి చిన్న పూరి గుడిసే ఆధారం. చిన్న వయస్సు నుంచి పేదరికాన్ని అధిగమించి క్రీడా రంగంలో ఆసక్తి పెంచుకున్నాడు. నేపాల్‌లో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని అందుకుని గ్రామీణ ప్రాంత యువతలో ఉత్సాహాన్ని నింపాడు. అతడు ఇప్పుడు నేపాల్‌లో ఆటలపోటీల్లో ఉన్నాడు.
చినిగిన చెప్పులతో ఎయిర్‌పోర్టుకు
నేపాల్‌కు వెళ్లడానికి చిత్రదుర్గం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చినిగి పోయిన చెప్పులతోనే నాగరాజు వెళ్లాడు. దీనిని గమనించిన తమ గ్రామానికి చెందిన న్యాయవాది అశోక్ నాగరాజ్‌కు షూ ఇప్పించాడు. గతనెల 26న నేపాల్ వెళ్లి రావడానికి స్నేహితులు, ఇతరులు రూ.2 వేలు ధనసహాయం చేశారు. అక్కడ గత నెల 29వ తేదీన జరిగిన అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో 24 దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సాధించాడు. పేద విద్యార్థి సాధనను తెలుసుకున్న నేపాల్ సైన్యం కూడా అభినందనలు తెలిపింది. చిత్రదుర్గ ప్రభుత్వం కళాశాలలో బీఏ చదువుకున్న నాగరాజు బీసీఎం హాస్టల్‌లో ఉండి డిగ్రీ చదువుతున్నాడు.
చదువుకుంటూ కూలి పని
తాలూకాలోని ఓబళాపుర గ్రామ పంచాయితీలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈరణ్ణ, చంద్రమ్మ దంపతుల కుమారుడు నాగరాజ్. గతంలో గోవాలో జరిగిన రాష్ట్రస్థాయి నాలుగవ అఖిల భారత చాంపియన్ షిప్‌లో పాల్గొని 10 వేల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో బంగారు పతకం కొట్టేశాడు. నాగరాజ్ తన చదువులు, ఖర్చుల కోసం తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడక, శని, ఆదివారాలలో కళ్యాణ మంటపాల్లో జరిగే వేడుకల్లో భోజనాలు వడ్డించే పని చేస్తాడు. ఆ డబ్బులో కొంత తల్లిదండ్రులకూ పంపుతాడు. మంగళవారం నేపాల్ నుంచి బెంగళూరులో దిగి, అటు నుంచి చెళ్లకెరెకు వస్తున్న నాగరాజ్‌కు స్థానిక ఎమ్మెల్యే టి.రఘుమూర్తి స్వాగతం పలికి సన్మానిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment