అరవైలలో...ఆరోగ్యమే ఒక పతకం | Special story on Veteran Athlete Pentyala Subbayamma | Sakshi
Sakshi News home page

అరవైలలో...ఆరోగ్యమే ఒక పతకం

Published Mon, Dec 28 2020 6:33 AM | Last Updated on Mon, Dec 28 2020 6:33 AM

Special story on Veteran Athlete Pentyala Subbayamma - Sakshi

జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వాళ్లకు వయసు అడ్డంకి కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మినవాళ్లు.. ఆరు పదులు దాటిన వయసులోనూ ‘సెంచరీలు కొట్టే వయస్సు మాది..’ అంటూ దూసుకెళ్తుంటారు. అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా ఇష్టమైన రంగాల్లో రాణిస్తుంటారు. ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారిలో గుంటూరులో నివాసం ఉంటున్న 67 ఏళ్ల పెంట్యాల సుబ్బాయమ్మ మొదటి వరుసలో ఉంటారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో షార్ట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్, స్విమ్మింగ్, పరుగు పోటీల్లో సత్తా చాటుతూ వెటరన్‌ అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆరోగ్యమే ఒక పతకం అంటున్నారు.

ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన సుబ్బాయమ్మకు అదే జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులకు చెందిన పెంట్యాల జైహింద్‌ గురూజీతో వివాహమైంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బాయమ్మ భర్త వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు కూడా నిర్వహించేవారు. పిల్లలు ప్రయోజకులై, పెళ్లిళ్లు చేసుకుని ఉద్యోగాల్లో ఉండటంతో 2006లో ద్రోణాదుల నుంచి సుబ్బాయమ్మ, జైహింద్‌లు గుంటూరు వచ్చి స్థిరపడ్డారు.

స్వగ్రామంలో యోగా శిక్షణ ఇస్తుండే సుబ్బాయమ్మ.. గుంటూరుకు వచ్చాక రోజూ ఎన్టీఆర్‌ స్టేడియానికి వెళ్లేవారు. 2008లో లాఫింగ్‌ క్లబ్‌లో చేరారు. క్లబ్‌ నిర్వాహకులు ఆమె ఉత్సాహం గమనించి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించారు. దీంతో ఈమె వెటరన్‌ అథ్లెట్‌గా రూపాంతరం చెందారు. షార్ట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్, స్విమ్మింగ్, పరుగు విభాగాల్లో సుబ్బాయమ్మ మైదానంలో దిగారంటే పతకం సాధించకుండా వెనుతిరగరు అనే పేరుంది. సుబ్బాయమ్మను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడంతో పాటు తాను కూడా వెటరన్‌ అథ్లెట్‌గా రాణిస్తున్నారు ఆమె భర్త 77 ఏళ్ల జైహింద్‌. నడక, పరుగు విభాగాల్లో భార్యతోపాటు వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో  పాల్గొని బహుమతులు సాధించారు.

నిత్య సాధన
సుబ్బాయమ్మ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి గంటన్నర పాటు యోగా, వ్యాయామం చేసి రన్నింగ్, వాకింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తారు. మొలకెత్తిన గింజలు, పండ్లు, డ్రైప్రూట్స్, చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటారు. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఎక్కువ ఉప్పు, నూనెలు ఆమె తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండవు. ఆరోగ్యం కోసం దంపతులిద్దరూ నేటికీ ప్రతిరోజు 3 గంటల పాటు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే ఇద్దరూ సేంద్రియ వంటకాలను గుంటూరు నగరవాసులకు పరిచయం చేస్తున్నారు.

సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నాలుగు ఎకరాల సొంత పొలంలో కొంత కౌలుకు ఇచ్చి కొంత భాగంలో తేనెటీగలు పెంచుతూ స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న ఈ దంపతులు తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేయడమే కాదు... అందరూ ఆరోగ్యంగా ఉండేందుకూ కృషి చేయడం అభినందనీయం.

విజేత సుబ్బాయమ్మ
2012 : బెంగుళూరు–జాతీయ స్థాయి 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ స్థానం.
2013 : బాపట్ల–రాష్ట్ర స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ స్థానం.
2014 : నెల్లూరు–100, 200, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం.
2015 : గుంటూరు–35 వ మాస్టర్స్‌ వెటరన్‌ అథ్లెటిక్స్‌లో డిస్కస్‌త్రో, 400 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానం, జావెలిన్‌ త్రో, 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం.
2016 : మధ్యప్రదేశ్‌–జాతీయ స్థాయి పోటీల్లో డిస్కస్‌ త్రో, జావెలిన్,100 మీటర్ల పరుగులో బంగారు పతకం.
2017 : బెంగళూరు–జాతీయ స్థాయి పరుగు పందెం పోటీలో బంగారు పతకం.
2018 : హైదరాబాద్‌–జాతీయ స్థాయి ఈత పోటీల్లో సుబ్బాయమ్మ మూడు విభాగాల్లో పతకాలు.
2020: కేరళ–జాతీయ స్థాయి పోటీల్లో డిస్కస్‌త్రో, జావెలిన్‌లో ప్రథమ బహుమతి.  

ఆరోగ్యవంతమైన సమాజం కోసం
మా క్రీడాస్ఫూర్తిని సమాజంలో నలుగురికి పంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడం మా లక్ష్యం. రాష్ట్రం సహా, దేశ వ్యాప్తంగా ఎక్కడ క్రీడల పోటీలున్నా నేను, నా భర్త వెళ్లి పాల్గొంటాం. ఉత్సాహం ఉన్న మా వయసు వారిని మాతో కలుపుకుని, ప్రాక్టీస్‌ చేయడంతో పాటు, వారిని కూడా పోటీలకు తీసుకువెళుతుంటాం. ఎవరమైనా మితాహారం, నిత్యం వ్యాయామం చేయడం వల్లే ఆరోగ్యంగా ఉంటాం.
– సుబ్బాయమ్మ, వెటరన్‌ క్రీడాకారిణి

– వడ్డే బాలశేఖర్‌. ‘సాక్షి’, గుంటూరు
ఫోటోలు : గజ్జల రామ్‌గోపాల్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement