గుంటూరు కొత్తపేటలోని ఆంధ్రా ఇవాంజికల్ లూథరన్ చర్చి ఆస్తులలో ఒకటైన గుంటగ్రౌండ్స్ ప్రహరీ గోడపై ఉన్న క్రీస్తు వాక్యాలను నగరపాలక సంస్థ అధికారులు శుక్రవారం చెరిపివేయించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కార్పొరేషన్ డీఈ సాంబశివరావు ఆదేశం మేరకు కాంట్రాక్టర్ ఈ చర్యకు ఉపక్రమించారు. మధ్యాహ్నానికి సిబ్బంది కొన్ని గోడలపై ఉన్న వాక్యాలను తొలగించి భోజనానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన ఏఈఎల్‌సీ బిషప్ రెవరెండ్ పరదేశీబాబు, ట్రెజరర్ జి.పాల్ ప్రభాకర్, ప్రిన్సిపాల్ టి.ముత్యం, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుంటగ్రౌండ్స్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఆ సమయంలో కొత్తపేట సీఐ వెంకన్నచౌదరి ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సిందిగా పరుష పదజాలంతో హెచ్చరించారు. దీంతో అధ్యాపకులు, విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న సంఘీయులకు సమాచారం అందించడంతో వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐ దురుసు మాటలకు నిరసనగా నాజ్ సెంటర్ కూడలిలోని నాలుగు వైపుల రాస్తారోకో చేసారు. కమిషనర్, డీఈ, సీఐలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్‌కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకులతో చర్చించి సంఘటన తప్పేనని, గోడలపై తిరిగి క్రీస్తు వాక్యాలు రాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
అక్రమంగా స్థలం ఆక్రమణ
ప్రిన్సిపాల్ ముత్యం మాట్లాడుతూ రెండు నెలల కిందట గుంటగ్రౌండ్స్ ముందు ఉన్న రోడ్డును వెడల్పు చేయడంలో భాగంగా రోడ్డుకు ఒకవైపు ఉన్న గుంటగ్రౌండ్స్ గోడను పగులగొట్టి 22 అడుగుల మేర రోడ్డులోకి కలిపి కార్పొరేషన్ అధికారులు గోడ కట్టారన్నారు. క్రైస్తవ సంఘాల నాయకులు దీన్ని అక్రమమని అడ్డుకుంటే అరెస్టు చేశారని ఆరోపించారు. రోడ్డుకు రెండోవైపు ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ స్థలంలో ఒక్క అంగుళం కూడా రోడ్డు విస్తరణకు తీసుకోలేదన్నారు. ఇప్పుడు క్రీస్తు వాక్యాలు తుడిపివేయడం సంఘీయులందరికీ అవమానకరమన్నారు.