ఏఓబీలో భయాందోళన
సీలేరు: ఏఓబీ సరిహద్దు నల్లమల్ల అడవుల తర్వాత అంతటి పేరు పొందిన ఈ అటవీ ప్రాంతంలో మంగళవారం అతి దగ్గర నుంచి రెండు హెలీకాప్టర్లు గిరిజన గ్రామాల ఇళ్లపై నుంచి చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా గిరిజనులు ఉలిక్కిపడ్డారు. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకున్నాయి. మరో 3 రోజుల్లో మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ హెలీకాప్టర్లు చక్కర్లు కొట్టడంతో ప్రజల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం మధ్యాహ్నాం 12 గంటల కు రెండు హెలీకాప్టర్లు ఒకదాని వెంట మరొకటి చక్కర్లు కొట్టుకుని తూర్పు అటవీ ప్రాంతాల వైపు వెళ్ళాయి. అవే హెలీకాప్టర్లు మళ్ళీ 5.30 సమయంలో తిరిగి అవే గ్రామాలవైపు ఒడిశా అటవీ ప్రాంతాల వైపు వెళ్ళాయి. వీటిని చూసి స్థానాకులు మళ్ళీ ఏదో ప్రమాదం జరిగిందని తీవ్ర భయాందోళన చెందారు. మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందుగానే ఈ హెలీకాప్టర్లతో సర్వే చేస్తున్నారని పలువురు చర్చించుకున్నారు.