వత్సవాయి: కృష్ణా జిల్లా వత్సవాయిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న కన్నెవీడుకు చెందిన విద్యార్థి రామలింగప్రసాద్ ఒత్తిడికి గురై పరీక్ష రాస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. కన్నెవీడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వత్సవాయి జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం పరీక్ష రాస్తున్న విద్యార్థి రామలింగప్రసాద్ 11.30 సమయంలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ విద్యార్థికి ఇటీవలే గుండె శస్త్రచికిత్స జరిగింది. వెంటనే వైద్యసిబ్బంది అతనికి సపర్యలు చేయడంతో కోలుకుని పరీక్ష కొనసాగించాడు. పరీక్ష ముగిసిన అనంతరం కన్నెవీడు జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆటోలో ఆ విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లారు.
హెచ్‌ఎం, తహశీల్దార్‌కు మనస్పర్థలు..
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్‌ఎంకు తహశీల్దార్‌కు మనస్పర్థలు రావడంతో తహశీల్దార్ పరీక్ష కేంద్రాన్ని సమస్యాత్మక కేంద్రంగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని జిల్లా అధికారులకు సూచించారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పరీక్షలు ప్రారంభం సమయం నుంచి ముగిసే వరకు పాఠశాలలోని ప్రతి గదిని తనిఖీచేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్లు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే ఇటీవలనే గుండె శ్రస్తచికిత్స చేయించుకున్న విద్యార్థి రామలింగప్రసాద్ సొమ్మసిల్లి పడిపోయినట్లు చెప్పారు. తహశీల్దార్ వైఖరిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయుల ఆరోపణలపై తహశీల్దార్ శ్రీనునాయక్‌ను వివరణ కోరగా వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
ఒత్తిడితో సొమ్మసిల్లిన టెన్త్ విద్యార్థి
Published Tue, Mar 22 2016 8:32 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM
Advertisement