టెన్త్ విద్యార్థి అదృశ్యం
టెన్త్ విద్యార్థి అదృశ్యం
Published Fri, Jul 29 2016 8:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రైవేట్ గురుకుల పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి తప్పిపోయిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మహబూబాబాద్ రూరల్ సీఐ జె.కృష్ణారెడ్డి కథనం ప్రకారం... గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామశివారు రాజ్యతండాకు చెందిన కొర్ర దేవా కుమారుడు సందీప్ మహబూబాబాద్ మండలంలోని జమాండ్లపల్లి గ్రామపంచాయితీ పరిధిలో గల ముత్యాలమ్మగూడెంలోని విద్యాభారతి గురుకుల పాఠశాలలో బోర్డర్‌గా ఉండి 10వ తరగతి చదువుతున్నాడు. సదరు విద్యార్థి మూడేళ్లుగా ఇదే పాఠశాల హాస్టల్‌లో ఉంటున్నాడు.
ఈ నెల 20న ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మొబైల్ నుంచి తండ్రికి ఫోన్ చేసి తనకు మెటీరియల్ కావాలని మాట్లాడాడు. అదే రోజు సాయంత్రం 4.15 గంటలకు దేవా పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ ఖాదర్ అనుమతితో సందీప్‌ను మెటీరియల్ కోసం మహబూబాబాద్‌కు తీసుకొచ్చాడు. మెటీరియల్ కొన్న తర్వాత సాయంత్రం 5.30 గంటలకు సందీప్‌ను పాఠశాలలోకి పంపించి తిరుగుపయనమయ్యాడు. తిరిగి ఈ నెల 28న సందీప్‌ను చూసి వద్దామని దేవా పాఠశాలకు వెళ్లగా అతడు లేడని పాఠశాల యాజమాన్యం సమాధానమిచ్చింది. దీంతో బాలుడి కోసం రెండు రోజులుగా ఎంత వెతికినా జాడ తెలియకపోవడంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ బాబు తప్పిపోవటానికి కారకులైన పాఠశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులో పేర్కొన్నట్ల రూర్ సీఐ జె.కృష్ణారెడ్డి తెలిపారు.
Advertisement