ఆవేదన వ్యక్తం చేస్తున్న టెట్ విత్‌హెల్డ్ బాధితులు
గందరగోళంలో టెట్ విత్‌హెల్డ్ అభ్యర్థులు
Published Thu, Jul 21 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
టేకులపల్లి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అభ్యర్థులు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓఎంఆర్ షీట్‌లో ప్రశ్నాపత్రం కోడ్ షేడ్ చేయని కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 3677 మంది అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారు. మండలానికి చెందిన బాధితులు ఇస్లావత్ బావ్‌సింగ్, భూక్య సురేష్, దారావత్ వెంకటేశ్, బానోతు రాజేశ్ గురువారం విలేకరులకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మే 22న నిర్వహించిన టెట్ పరీక్షకు మే 17 న ఫలితాలు విడుదల చేశారు. ఓఎంఆర్ షీట్‌లో ప్రశ్నాపత్రం కోడ్ వేయని కారణంగా తమ ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారని పేర్కొన్నారు. ఫలితాలు ఇవ్వకపోవడంతో విద్యావలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేక పోయామని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జూన్ 22న హైదరాబాద్‌లోని టెట్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారి రాంమోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన అధికారి పదిహేను రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఫలితాలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఫలితాలు విడుదల చేయాలని కోరారు. జిల్లాకు చెందిన టెట్ విత్‌హెల్డ్ బాధితులు కలిసి రావాలని, పూర్తి వివరాలకు 80083 03485 నంబరులో సంప్రదించాలని కోరారు. బాధితులు విష్ణు, రాంబాబు, సంతోష్, కవిత,స్వాతి, రమేష్, ఆశ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement