withheld
-
గందరగోళంలో టెట్ విత్‌హెల్డ్ అభ్యర్థులు
టేకులపల్లి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అభ్యర్థులు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓఎంఆర్ షీట్లో ప్రశ్నాపత్రం కోడ్ షేడ్ చేయని కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 3677 మంది అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారు. మండలానికి చెందిన బాధితులు ఇస్లావత్ బావ్‌సింగ్, భూక్య సురేష్, దారావత్ వెంకటేశ్, బానోతు రాజేశ్ గురువారం విలేకరులకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మే 22న నిర్వహించిన టెట్ పరీక్షకు మే 17 న ఫలితాలు విడుదల చేశారు. ఓఎంఆర్ షీట్లో ప్రశ్నాపత్రం కోడ్ వేయని కారణంగా తమ ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారని పేర్కొన్నారు. ఫలితాలు ఇవ్వకపోవడంతో విద్యావలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేక పోయామని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జూన్ 22న హైదరాబాద్‌లోని టెట్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారి రాంమోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన అధికారి పదిహేను రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఫలితాలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఫలితాలు విడుదల చేయాలని కోరారు. జిల్లాకు చెందిన టెట్ విత్‌హెల్డ్ బాధితులు కలిసి రావాలని, పూర్తి వివరాలకు 80083 03485 నంబరులో సంప్రదించాలని కోరారు. బాధితులు విష్ణు, రాంబాబు, సంతోష్, కవిత,స్వాతి, రమేష్, ఆశ తదితరులు పాల్గొన్నారు. -
వివాదంలో మరో విశ్వవిద్యాలయం
న్యూఢిల్లీ: హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదం ఇంకా చల్లారకముందే దేశ రాజధాని లో ప్రముఖ యూనిర్శిటీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కలకలం రేపింది. తన సమస్యను వారంలోగా తేల్చాలని ...లేకుంటే ప్రాణత్యాగం చేస్తానని బెదిరిస్తూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ను ఉద్దేశించి రెండు లేఖలు రాశాడు. తనకు రావాల్సిన గ్రాంట్ ను మంజూరు చేయకుండా వివక్షను గురి చేసి, వేధిస్తున్నారని దళిత స్కాలర్ మదన్ మెహర్ ఆరోపిస్తున్నాడు. తన పీహెచ్‌డీని ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిలిపి వేసిన తన ఫెలోషిప్‌ను తక్షణమే కొనసాగించాలని అతడు డిమాండ్ చేశాడు. వారంలోగా తన సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖలో తెలిపాడు. అయితే యూనివర్శిటీ వాదన దీనికి భిన్నంగా ఉంది. సదరు విద్యార్థి బ్రస్సెల్స్, బెల్జియంలో పర్యటన కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న రూ 66,000 ను యూనివర్శిటీకి తిరిగి చెల్లించాల్సింది ఉందన్నారు. విద్యార్ధి తన ఫెలోషిప్ కొనసాగించడానికి అనుమతించే ముందు, ఆ మొత్తం డబ్బులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుదని వైస్ ఛాన్సలర్ హెచ్. శర్మ బుధవారం పేర్కొన్నారు. వర్శిటీ కంట్రోలర్, ఫైనాన్స్ అధికారి నుంచి అనుమతి లేకపోవడంతోనే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొడిగింపును నిలిపి వేసినట్టు చెప్పారు. మరోవైపు విద్యార్థిని ఒక కంట కనిపెట్టమని యూనివర్శిటీ భద్రతా అధికారిని అప్రమత్తం చేశామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మరో అధికారి హామీ ఇచ్చారు. మరోవైపు సమస్యలపై వర్సిటీ అధికారులు ఫిబ్రవరి 8న విద్యార్థులతో భేటీ కానుంది. కాగా జనవరి 17 న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్(26) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.