
తల్లి హలీదాతో శిశువును చూపిస్తున్న అపోలో వైద్యులు..
బంజారాహిల్స్: విమాన ప్రయాణంలో పుట్టిన శిశువు జూబ్లీహిల్స్ అపోలో క్రెడిల్‌లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని అపోలో క్రెడిల్ చీఫ్ న్యూనటాలజిస్ట్ డాక్టర్ సీవీఎస్ లక్ష్మి తెలిపారు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఆ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 14న సెబు పసిఫిక్ ఎయిర్ విమానంలో దుబాయ్ నుంచి మనీలాకు ఫిలిప్పీన్స్‌కు చెందిన 32 ఏళ్ల హలీదా అనే గర్భిణి వెళుతున్నారు.
ఈక్రమంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో విమానాన్ని హైదరాబాద్‌లో అత్యవసరంగా దించారు. ఎనిమిది నెలలకే ఆమె ఆడ శిశువును ప్రసవించింది. వెంటనే అపోలో మెడికల్ సెంటర్ ఎయిర్‌పోర్ట్ టీమ్ ఆమెను అపోలో క్రెడిల్‌కి తరలించారు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న శిశువుకు కృత్రిమ శ్వాసను అందించి శ్వాస మార్గాన్ని పరిరక్షించారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగా ఉందని డాక్టర్ లక్ష్మి తెలిపారు. తల్లి హాలిదా ఆనందంతో వైద్యులను ప్రశంసించారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్ ప్రమీలా శేఖర్ తెలిపారు.