- రీలర్లందరూ సహకరించాలి
- రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ
- పట్టుపరిశ్రమ శాఖ జేడీ అరుణకుమారి
హిందూపురం రూరల్:
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పట్టుగూళ్ల క్రయ విక్రయాలన్నీ ఇక నుంచి నగదు రహితంగానే జరుగుతాయని, రీలర్లందరూ సహకరించాలని పట్టుపరిశ్రమ శాఖ జేడీ అరుణకుమారి అన్నారు. హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆమె రీలర్లనుద్దేశించి మాట్లాడారు. రహిత లావాదేవీలపై ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. బ్యాంకు, పట్టుపరిశ్రమ శాఖ ద్వారా ఆర్థిక సాయం అందించాలని పలువురు రీలర్లు కోరారు. బ్యాంకులో ఓడి సదుపాయం కల్పించాలని, ఇన్సెంటివ్స్ నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టుగూళ్లు కొనుగోలు చేసే వ్యాపారులు ముందుగా మార్కెట్ పేరుతో చెక్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రైతులకూ చెక్ ద్వారా వారి ఖాతాల్లోకి నగదును రెండు, మూడు రోజుల్లో జమ చేస్తామన్నారు. రీలర్లు కరెంటు ఖాతాను తెరుచుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కరుణాకరన్ తెలిపారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఏడీ నాగరంగయ్య, మార్కెట్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, రీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రియాజ్, మార్కెట్ మేనేజర్ శాస్త్రి పాల్గొన్నారు.