Jd arunakumari
-
వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు
- కంబదూరు, రాచేపల్లి వద్ద నర్సరీలో మొక్కలు - ఈ ఏడాది 200 ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం - పట్టు పరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి వెల్లడి అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది కనీసం 200 ఎకరాల్లో వృక్ష పద్ధతి (ట్రీప్లాంటేషన్)లో మల్బరీ (రేషం) పంటను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణకుమారి తెలిపారు. ఈమేరకు మంగళవారం జాయింట్ డైరెక్టర్ అరుణకుమారి వివరాలు వెల్లడించారు. అటవీశాఖాధికారి రమణ సహకారంతో కంబదూరు, రాచేపల్లి వద్ద నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నామన్నారు. కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే మొక్కల రేట్లు నిర్ణయించి, పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పద్ధతిలో మల్బరీ సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన వందలాది మంది రైతులను కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ సాగు చేస్తున్న పంట పొలాలు, రైతుల అనుభవాలు తెలియజేశామన్నారు. దీంతో జిల్లా రైతులు కూడా వృక్ష పద్ధతిలో మల్బరీ పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నందున నర్సరీ మొక్కలు అందుబాటులోకి తెచ్చామన్నారు. 10 -10 అడుగుల దూరంలో మొక్కలు నాటుకునేందుకు 4 - ›4 - ›4 అడుగుల కొలతల్లో గుంతలు తవ్వుకోవాలన్నారు. ఏడాదిపాటు పెంచిన తర్వాత పెద్ద చెట్లు మాదిరిగా పెరుగుతాయన్నారు. భూమి నుంచి మూడు అడుగుల వరకు పెంచి అక్కడి నుంచి క్రమ పద్ధతిలో కత్తిరింపులు చేసుకుంటే భవిష్యత్తులో ఒక్కో మొక్క నుంచి ఒక గుడ్డు మేపవచ్చన్నారు. ఒకసారి నాటుకుంటే 20 ఏళ్లకు పైబడి పంటలు మేపవచ్చన్నారు. ట్రీప్లాంటేషన్తో పాటు బైవోల్టిన్ పట్టు గూళ్లు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాకీ పెంపకం యూనిట్ ఒకటి మంజూరైందన్నారు. యూనిట్ విలువ రూ.12 లక్షలు కాగా అందులో 75 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) కింద జిల్లాకు 150 పెంపకం షెడ్లు మంజూరైనట్లు తెలిపారు. వీటికి పైకప్పు కొట్టం మాదిరిగా ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుందన్నారు. 50 - 20 అడుగుల కొలతలు కలిగిన ఒక్కో షెడ్డుకు రూ.1.37 లక్షలు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. వీటితో పాటు ఎస్సీ రైతులకు వివిధ పథకాల్లో 90 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ ఏడాది టర్బోఫ్యాన్లు కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఒక్కో షెడ్డుకు రెండు లేదా మూడు టర్భోఫ్యాన్లు ఏర్పాటు చేసుకుంటే షెడ్డు లోపల వాతావరణం పూర్తిగా నియంత్రణలో ఉంటుందన్నారు. త్వరలో వీటి ధరలు, రాయితీలు ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
వృక్ష పద్ధతి మల్బరీ సాగుపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని పట్టుపరిశ్రమశాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణుకుమారి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. అందులో భాగంగా ఈ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వృక్ష పద్ధతిలో మల్బరీ సాగుచేస్తున్న కర్ణాటక ప్రాంతానికి రైతులను తీసుకెళుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి డివిజన్ నుంచి 80 మంది రైతులను రెండు రోజుల పాటు చిక్‌బళ్లాపూర్, దొడ్డబళ్లాపూర్, కోలార్, బెంగళూరు, మైసూర్ ప్రాంతాల్లో తిప్పి అక్కడ సాగు చేస్తున్న మల్బరీ పంటలను చూపిస్తున్నామన్నారు. ఇప్పటికే ఒక బృందంలోని రైతులు క్షేత్ర పరిశీలనకు వెళ్లి వచ్చారన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల పట్టు సాగుకు ఇబ్బందిగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు చేయడం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పద్ధతులను ఎలా ఉపయోగించాలన్న దానిపై పర్యటనలో రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఇక నగదు రహితమే
రీలర్లందరూ సహకరించాలి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ పట్టుపరిశ్రమ శాఖ జేడీ అరుణకుమారి హిందూపురం రూరల్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పట్టుగూళ్ల క్రయ విక్రయాలన్నీ ఇక నుంచి నగదు రహితంగానే జరుగుతాయని, రీలర్లందరూ సహకరించాలని పట్టుపరిశ్రమ శాఖ జేడీ అరుణకుమారి అన్నారు. హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్లో మంగళవారం ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆమె రీలర్లనుద్దేశించి మాట్లాడారు. రహిత లావాదేవీలపై ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. బ్యాంకు, పట్టుపరిశ్రమ శాఖ ద్వారా ఆర్థిక సాయం అందించాలని పలువురు రీలర్లు కోరారు. బ్యాంకులో ఓడి సదుపాయం కల్పించాలని, ఇన్సెంటివ్స్ నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టుగూళ్లు కొనుగోలు చేసే వ్యాపారులు ముందుగా మార్కెట్ పేరుతో చెక్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రైతులకూ చెక్ ద్వారా వారి ఖాతాల్లోకి నగదును రెండు, మూడు రోజుల్లో జమ చేస్తామన్నారు. రీలర్లు కరెంటు ఖాతాను తెరుచుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కరుణాకరన్ తెలిపారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఏడీ నాగరంగయ్య, మార్కెట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, రీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రియాజ్, మార్కెట్ మేనేజర్ శాస్త్రి పాల్గొన్నారు.