వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు
- కంబదూరు, రాచేపల్లి వద్ద నర్సరీలో మొక్కలు
- ఈ ఏడాది 200 ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం
- పట్టు పరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి వెల్లడి
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది కనీసం 200 ఎకరాల్లో వృక్ష పద్ధతి (ట్రీప్లాంటేషన్)లో మల్బరీ (రేషం) పంటను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణకుమారి తెలిపారు. ఈమేరకు మంగళవారం జాయింట్ డైరెక్టర్ అరుణకుమారి వివరాలు వెల్లడించారు. అటవీశాఖాధికారి రమణ సహకారంతో కంబదూరు, రాచేపల్లి వద్ద నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నామన్నారు. కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే మొక్కల రేట్లు నిర్ణయించి, పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పద్ధతిలో మల్బరీ సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన వందలాది మంది రైతులను కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ సాగు చేస్తున్న పంట పొలాలు, రైతుల అనుభవాలు తెలియజేశామన్నారు.
దీంతో జిల్లా రైతులు కూడా వృక్ష పద్ధతిలో మల్బరీ పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నందున నర్సరీ మొక్కలు అందుబాటులోకి తెచ్చామన్నారు. 10 -10 అడుగుల దూరంలో మొక్కలు నాటుకునేందుకు 4 - ›4 - ›4 అడుగుల కొలతల్లో గుంతలు తవ్వుకోవాలన్నారు. ఏడాదిపాటు పెంచిన తర్వాత పెద్ద చెట్లు మాదిరిగా పెరుగుతాయన్నారు. భూమి నుంచి మూడు అడుగుల వరకు పెంచి అక్కడి నుంచి క్రమ పద్ధతిలో కత్తిరింపులు చేసుకుంటే భవిష్యత్తులో ఒక్కో మొక్క నుంచి ఒక గుడ్డు మేపవచ్చన్నారు. ఒకసారి నాటుకుంటే 20 ఏళ్లకు పైబడి పంటలు మేపవచ్చన్నారు. ట్రీప్లాంటేషన్‌తో పాటు బైవోల్టిన్ పట్టు గూళ్లు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాకీ పెంపకం యూనిట్ ఒకటి మంజూరైందన్నారు.
యూనిట్ విలువ రూ.12 లక్షలు కాగా అందులో 75 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై) కింద జిల్లాకు 150 పెంపకం షెడ్లు మంజూరైనట్లు తెలిపారు. వీటికి పైకప్పు కొట్టం మాదిరిగా ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుందన్నారు. 50 - 20 అడుగుల కొలతలు కలిగిన ఒక్కో షెడ్డుకు రూ.1.37 లక్షలు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. వీటితో పాటు ఎస్సీ రైతులకు వివిధ పథకాల్లో 90 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ ఏడాది టర్బోఫ్యాన్లు కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఒక్కో షెడ్డుకు రెండు లేదా మూడు టర్భోఫ్యాన్లు ఏర్పాటు చేసుకుంటే షెడ్డు లోపల వాతావరణం పూర్తిగా నియంత్రణలో ఉంటుందన్నారు. త్వరలో వీటి ధరలు, రాయితీలు ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.