
రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయుల దాష్టీకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా ఓ దళిత రైతు మల్బరీ పంటపై పురుగు మందు పిచికారీ చేసి, అతనికి తీరని నష్టం కలిగించారు. పరిటాల కుటుంబం అండతోనే టీడీపీ వర్గీయులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బాధిత రైతు వాపోతున్నాడు.
శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గరిమేకలపల్లికి చెందిన హరిజన కొల్లప్ప వైఎస్సార్‌సీపీలో చురుకైన కార్యకర్త. కొల్లప్పకు ఇటీవల పార్టీ సచివాలయ కన్వీనర్ బాధ్యతలు కూడా అప్పగించారు. కొల్లప్ప స్థానికంగా వైఎస్సార్‌సీపీని మరింతగా పటిష్ట పరచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు రెండెకరాల్లో అతను సాగు చేస్తున్న మల్బరీ పంటపై శనివారం పురుగు మందు పిచికారీ చేశారు. మూడు రోజుల్లో పట్టు గూళ్ల ఉత్పత్తి మొదలవుతుందనగా ఈ దాష్టీకానికి పాల్పడ్డారు.
ఆదివారం ఉదయం పట్టు పురుగులు చనిపోయి ఉండడంతో కొల్లప్ప తోటను పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర జరిగిన సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. రామగిరి ఎస్‌ఐ జనార్ధన్ నాయుడు ఆదివారం బాధిత రైతు మల్బరీ తోటను పరిశీలించారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment