malbary crop
-
టీడీపీ వర్గీయుల దాష్టీకం.. రైతుకు కోలుకోలేని నష్టం
రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయుల దాష్టీకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా ఓ దళిత రైతు మల్బరీ పంటపై పురుగు మందు పిచికారీ చేసి, అతనికి తీరని నష్టం కలిగించారు. పరిటాల కుటుంబం అండతోనే టీడీపీ వర్గీయులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బాధిత రైతు వాపోతున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గరిమేకలపల్లికి చెందిన హరిజన కొల్లప్ప వైఎస్సార్సీపీలో చురుకైన కార్యకర్త. కొల్లప్పకు ఇటీవల పార్టీ సచివాలయ కన్వీనర్ బాధ్యతలు కూడా అప్పగించారు. కొల్లప్ప స్థానికంగా వైఎస్సార్సీపీని మరింతగా పటిష్ట పరచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు రెండెకరాల్లో అతను సాగు చేస్తున్న మల్బరీ పంటపై శనివారం పురుగు మందు పిచికారీ చేశారు. మూడు రోజుల్లో పట్టు గూళ్ల ఉత్పత్తి మొదలవుతుందనగా ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం పట్టు పురుగులు చనిపోయి ఉండడంతో కొల్లప్ప తోటను పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర జరిగిన సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. రామగిరి ఎస్ఐ జనార్ధన్ నాయుడు ఆదివారం బాధిత రైతు మల్బరీ తోటను పరిశీలించారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లాభాలు ‘పట్టు’
12 వందల ఎకరాల్లో మల్బరీ సాగు ట్రీప్లాంటేషన్ విధానంలో పంట సాగు అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు కుందుర్పి: తక్కువ నీటి వనరులున్న రైతులు బిందుసేద్యం ద్వారా తక్కువ విస్త్రీర్ణంలో మల్బరీ పంటను సాగుచేసి ఆర్థికంగా బలపడుతున్నారు. ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో 812 ఎకరాలు, శెట్టూరు మండలంలో 68 ఎకరాలు, బ్రహ్మసముద్రంలో 56 ఎకరాలు, కంబదూరులో 210 ఎకరాలు, కళ్యాణదుర్గం మండలంఓ 54 ఎకరాల్లో రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. విస్తృత ప్రోత్సాహాకాలు ఎకరా విస్తీర్ణంలో ట్రీ ప్లాంటేషన్ విధానంలో 435 మొక్కలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం తరుఫున రూ. 22,500 ప్రోత్సాహాకాన్ని అందజేస్తున్నారు. అలాగే వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కొ రేరింగ్ షెడ్డు నిర్మాణానికి రాష్రీ్టయ వికాస్ యోజన కింద రూ.1.37లక్షలు అందజేస్తున్నారు. దీంతో పాటు వరండా ఏర్పాటుకు రూ.22వేలు ఇస్తున్నారు. 600 చదరపు అడుగుల్లో షెడ్డు నిర్మాణానికి రూ. 87 వేలు, వరండా ఏర్పాటుకు రూ. 18 వేలు అందజేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు కుందుర్పిలో 219, శెట్టూరులో 16, కంబదూరులో 62, కళ్యాణదుర్గంలో 18, బ్రహ్మసముద్రంలో 14 షెడ్లు నిర్మించినట్లు అసిస్టెంట్ సిరికల్చర్ అధికారి రామ్మోహన్ పేర్కొంటున్నారు. రైతులకు అందుబాటులో చాకీ సెంటర్ కళ్యాణదుర్గంలోని మారెంపల్లిలో చాకీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నెలకు 9 వేల నుంచి 12 వేల గుడ్లను ఉత్పత్తి చేసి చాకీ అయిన పది రోజుల తర్వాత రైతులకు అందజేస్తుంటారు. వంద గుడ్లను రూ. 18 వందలతో రైతులకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో వీవన్, జీ2, ఎస్6, బైవోల్టిన్, మైల్టీఓల్టిన్ రకాల గుడ్లకు డిమాండ్ ఉండడంతో ఈ రకం గుడ్లనే ఇక్కడి ఉత్పత్తి చేసి ఇస్తున్నారు. ఆశించిన దిగుబడులు ఉన్నాయి పదేళ్లుగా నేను మల్బరీ సాగు చేస్తున్నాను. ఎకరా విస్తీర్ణంలో రెండు నెలలకోసారి మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకూ ఆదాయం గడిస్తున్నాను. పంట దిగుబడులు ఆశించిన మేర ఉంటోంది. - సురేష్, అప్పాజిపాళ్యం, కుందుర్పి మండలం 20 రోజుల్లో చేతికి నగదు పట్టు పురుగుల పెంపకం ద్వారా కేవలం 20రోజుల్లోనే చేతికి నగదు అందుతోంది. రెండు ఎకరాల్లో మల్బరీ సాగుచేశాను. రెండు నెలలకోసారి రూ. లక్ష వరకు ఆదాయం తీసుకుంటున్నాను. 20 రోజులు పట్టు పురుగులను సంరక్షించుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయి. – ఈరన్న, నాగేపల్లి, కుందుర్పి మండలం ట్రీ ప్లాంటేషన్‌తో మల్బరీ సాగుచేయండి ట్రీ ప్లాంటేషన్ పద్దతిన మల్బరీ సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.30వేలు ప్రోత్సాహాకాన్ని అందజేస్తున్నాం. అంతేకాక రేరింగ్ షెడ్ల నిర్మాణానికి రూ.1.37 లక్షలు ఇస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో కిలో పట్టుగూళ్లు రూ. 440 నుంచి రూ. 450 వరకు అమ్ముడు పోతున్నాయి. దీనికి తోడు కిలో పట్టుగూళ్లకు రూ.50 వంతున ప్రోత్సాహాకాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. – కిరణ్‌కుమార్, శాస్త్రవేత్త, పట్టు పరిశోధనసంస్థ, కళ్యాణదుర్గం -
వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు
- కంబదూరు, రాచేపల్లి వద్ద నర్సరీలో మొక్కలు - ఈ ఏడాది 200 ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం - పట్టు పరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి వెల్లడి అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది కనీసం 200 ఎకరాల్లో వృక్ష పద్ధతి (ట్రీప్లాంటేషన్)లో మల్బరీ (రేషం) పంటను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణకుమారి తెలిపారు. ఈమేరకు మంగళవారం జాయింట్ డైరెక్టర్ అరుణకుమారి వివరాలు వెల్లడించారు. అటవీశాఖాధికారి రమణ సహకారంతో కంబదూరు, రాచేపల్లి వద్ద నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నామన్నారు. కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే మొక్కల రేట్లు నిర్ణయించి, పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పద్ధతిలో మల్బరీ సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన వందలాది మంది రైతులను కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ సాగు చేస్తున్న పంట పొలాలు, రైతుల అనుభవాలు తెలియజేశామన్నారు. దీంతో జిల్లా రైతులు కూడా వృక్ష పద్ధతిలో మల్బరీ పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నందున నర్సరీ మొక్కలు అందుబాటులోకి తెచ్చామన్నారు. 10 -10 అడుగుల దూరంలో మొక్కలు నాటుకునేందుకు 4 - ›4 - ›4 అడుగుల కొలతల్లో గుంతలు తవ్వుకోవాలన్నారు. ఏడాదిపాటు పెంచిన తర్వాత పెద్ద చెట్లు మాదిరిగా పెరుగుతాయన్నారు. భూమి నుంచి మూడు అడుగుల వరకు పెంచి అక్కడి నుంచి క్రమ పద్ధతిలో కత్తిరింపులు చేసుకుంటే భవిష్యత్తులో ఒక్కో మొక్క నుంచి ఒక గుడ్డు మేపవచ్చన్నారు. ఒకసారి నాటుకుంటే 20 ఏళ్లకు పైబడి పంటలు మేపవచ్చన్నారు. ట్రీప్లాంటేషన్తో పాటు బైవోల్టిన్ పట్టు గూళ్లు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాకీ పెంపకం యూనిట్ ఒకటి మంజూరైందన్నారు. యూనిట్ విలువ రూ.12 లక్షలు కాగా అందులో 75 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) కింద జిల్లాకు 150 పెంపకం షెడ్లు మంజూరైనట్లు తెలిపారు. వీటికి పైకప్పు కొట్టం మాదిరిగా ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుందన్నారు. 50 - 20 అడుగుల కొలతలు కలిగిన ఒక్కో షెడ్డుకు రూ.1.37 లక్షలు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. వీటితో పాటు ఎస్సీ రైతులకు వివిధ పథకాల్లో 90 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ ఏడాది టర్బోఫ్యాన్లు కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఒక్కో షెడ్డుకు రెండు లేదా మూడు టర్భోఫ్యాన్లు ఏర్పాటు చేసుకుంటే షెడ్డు లోపల వాతావరణం పూర్తిగా నియంత్రణలో ఉంటుందన్నారు. త్వరలో వీటి ధరలు, రాయితీలు ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.