లాభాలు ‘పట్టు’
12 వందల ఎకరాల్లో మల్బరీ సాగు
ట్రీప్లాంటేషన్ విధానంలో పంట సాగు
అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు
కుందుర్పి: తక్కువ నీటి వనరులున్న రైతులు బిందుసేద్యం ద్వారా తక్కువ విస్త్రీర్ణంలో మల్బరీ పంటను సాగుచేసి ఆర్థికంగా బలపడుతున్నారు. ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో 812 ఎకరాలు, శెట్టూరు మండలంలో 68 ఎకరాలు, బ్రహ్మసముద్రంలో 56 ఎకరాలు, కంబదూరులో 210 ఎకరాలు, కళ్యాణదుర్గం మండలంఓ 54 ఎకరాల్లో రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు.
విస్తృత ప్రోత్సాహాకాలు
ఎకరా విస్తీర్ణంలో ట్రీ ప్లాంటేషన్ విధానంలో 435 మొక్కలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం తరుఫున రూ. 22,500 ప్రోత్సాహాకాన్ని అందజేస్తున్నారు. అలాగే వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కొ రేరింగ్ షెడ్డు నిర్మాణానికి రాష్రీ‍్టయ వికాస్ యోజన కింద రూ.1.37లక్షలు అందజేస్తున్నారు. దీంతో పాటు వరండా ఏర్పాటుకు రూ.22వేలు ఇస్తున్నారు. 600 చదరపు అడుగుల్లో షెడ్డు నిర్మాణానికి రూ. 87 వేలు, వరండా ఏర్పాటుకు రూ. 18 వేలు అందజేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు కుందుర్పిలో 219, శెట్టూరులో 16, కంబదూరులో 62, కళ్యాణదుర్గంలో 18, బ్రహ్మసముద్రంలో 14 షెడ్లు నిర్మించినట్లు అసిస్టెంట్ సిరికల్చర్ అధికారి రామ్మోహన్ పేర్కొంటున్నారు.
రైతులకు అందుబాటులో చాకీ సెంటర్
కళ్యాణదుర్గంలోని మారెంపల్లిలో చాకీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నెలకు 9 వేల నుంచి 12 వేల గుడ్లను ఉత్పత్తి చేసి చాకీ అయిన పది రోజుల తర్వాత రైతులకు అందజేస్తుంటారు. వంద గుడ్లను రూ. 18 వందలతో రైతులకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో వీవన్, జీ2, ఎస్6, బైవోల్టిన్, మైల్టీఓల్టిన్ రకాల గుడ్లకు డిమాండ్ ఉండడంతో ఈ రకం గుడ్లనే ఇక్కడి ఉత్పత్తి చేసి ఇస్తున్నారు.
ఆశించిన దిగుబడులు ఉన్నాయి
పదేళ్లుగా నేను మల్బరీ సాగు చేస్తున్నాను. ఎకరా విస్తీర్ణంలో రెండు నెలలకోసారి మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకూ ఆదాయం గడిస్తున్నాను. పంట దిగుబడులు ఆశించిన మేర ఉంటోంది.
- సురేష్, అప్పాజిపాళ్యం, కుందుర్పి మండలం
20 రోజుల్లో చేతికి నగదు
పట్టు పురుగుల పెంపకం ద్వారా కేవలం 20రోజుల్లోనే చేతికి నగదు అందుతోంది. రెండు ఎకరాల్లో మల్బరీ సాగుచేశాను. రెండు నెలలకోసారి రూ. లక్ష వరకు ఆదాయం తీసుకుంటున్నాను. 20 రోజులు పట్టు పురుగులను సంరక్షించుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయి.
– ఈరన్న, నాగేపల్లి, కుందుర్పి మండలం
ట్రీ ప్లాంటేషన్‌తో మల్బరీ సాగుచేయండి
ట్రీ ప్లాంటేషన్ పద్దతిన మల్బరీ సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.30వేలు ప్రోత్సాహాకాన్ని అందజేస్తున్నాం. అంతేకాక రేరింగ్ షెడ్ల నిర్మాణానికి రూ.1.37 లక్షలు ఇస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో పట్టుగూళ్లు రూ. 440 నుంచి రూ. 450 వరకు అమ్ముడు పోతున్నాయి. దీనికి తోడు కిలో పట్టుగూళ్లకు రూ.50 వంతున ప్రోత్సాహాకాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.
– కిరణ్‌కుమార్, శాస్త్రవేత్త, పట్టు పరిశోధనసంస్థ, కళ్యాణదుర్గం